మంత్రుల కమిటీపై నమ్మకం లేదు: పల్లంరాజు
అన్నవరం : రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం (కేంద్ర మంత్రుల బృందం) మీద నమ్మకం లేదని కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. ఆయన సోమవారం అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ అంటోనీ కమిటీ నివేదిక రాకుండానే ....తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రావటం బాధాకరమన్నారు. తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని పల్లంరాజు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవటం తగదని అన్నారు.
మరోవైపు మూడున్నర నెలలుగా జిల్లాకు దూరంగా ఉన్న పల్లంరాజు ఎట్టకేలకు సోమవారం జిల్లాలో అడుగు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో జిల్లాలో అడుగు పెట్టేందుకు ధైర్యం చాలక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు.
అలుపెరగకుండా జీతాలను వదులుకుని, కుటుంబ కష్టాలను సైతం ఖాతరు చేయని వేలాది మంది ఉద్యోగులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు 75 రోజులుగా జిల్లాలో సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం కంటికి కనబడలేదా అని విమర్శిస్తున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పల్లంరాజు నివాసం వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి.