
ఆదర్శం అవుట్
నరసన్నపేట రూరల్: టీడీపీ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అధికారం చేపట్టక ముందు నుంచే అదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన తెలుగుదేశం నేతలు అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత తామనుకున్నది చేసేశారు. ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న సాకు చూపిస్తూ.. దీని స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పేరుతో జీవో నెం. 43 జారీ అయ్యింది. ఈ జీవో ఫలితంగా ఆదర్శ రైతుల వ్యవస్థ రద్దు కాగా.. జిల్లాలో 1652 మంది ఆదర్శ రైతులు ఇంటికే పరిమితం కానున్నారు.
వ్యయసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణించే వరకూ ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగం చాలా బలోపేతమైంది. ఆదర్శ రైతుల ద్వారానే గ్రామాల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ సమాచారాన్ని గ్రామస్థాయిలో రైతులకు చేరవేయడంతోపాటు.. ఏ తెగులుకు ఏ మందు వాడాలి, ఏ సమయంలో ఏ ఎరువు వాడితే దిగుబడి బాగుంటుందన్న సూచనలు ఇచ్చేవారు. వైఎస్‌ఆర్ మరణాంతరం ఈ వ్యవస్థ గాడి తప్పింది.
దీంతో అనర్హులను తొలగించాలన్న ఉద్దేశంతో 2012 జూన్‌లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆదర్శ రైతులకు పరీక్షలు నిర్వహించింది. గత ఏడాది ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ పరీక్షల్లో తప్పినవారిని తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని చెప్పినా అది అమలు కాలేదు. మొదట్లో 2800 ఆదర్శ రైతులు ఉండగా పరీక్షల సమయానికి 2400 మంది ఉండేవారు. పరీక్షల్లో తప్పిన 400 మందిని తొలగించగా, మరికొంత మంది మానివేశారు. దీంతో ప్రస్తుతం 1652 మంది మిగిలారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు. వ్యవసాయశాఖ ఇచ్చిన పనులను చేస్తూ రైతులకు ఉపయుక్తంగా ఉండేవారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే ఆదర్శ రైతులుగా ఉన్నారని ఆరోపిస్తున్న టీడీపీ, అధికారంలోకి రావడంతో ఆ వ్యవస్థనే రూపుమాపేసింది.
తీవ్ర వ్యతిరేకత
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శ రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పనిచేయని వారిని తొలగిస్తే బాగుం డేది. అలాగే ఉన్న వారితో పని చేయించుకోవాలే గానీ తొలగించడం అన్యాయమంటున్నారు. చాలా మంది ఇదే పనిని నమ్ముకొని ఉండిపోయారని, ప్రభుత్వ ఉత్తర్వులతో తామంతా వీధిన పడ్డామని వాపోతున్నారు. 18 నెలలుగా నెలవారీ తమకివ్వాల్సిన వెయ్యి రూపాయల గౌరవ వేతనం కూడా ఇవ్వడంలేదని, దాని సంగతి ఏమటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా జీవోలతో తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టుకు వెళతాం
ఎటువంటి సమీక్షలు, పరిశీలనలు లేకుండా అందరినీ మూకుమ్మడిగా తొలగించడం అన్యాయం. దీనిపై కోర్టును ఆశ్రయిస్తాం. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం. జీవో కాపీని పూర్తిగా పరిశీలించన తర్వాత కోర్టులో పిటిషన్ వేస్తాం. మాకు రావాల్సిన 18 నెలల వేతన బకాయిల కోసం ఆందోళనలు నిర్వహిస్తాం.
-శ్రీనివాసరావు, జిల్లా సంఘం అధ్యక్షుడు