
సమస్యలు పరిష్కరించకపోతేప్రభుత్వాన్ని గద్దె దింపుతాం
అనంతపురం అర్బన్: ఉపాధ్యాయుల, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి.
ఉపాధ్యాయ సంఘాలు
అనంతపురం అర్బన్:
ఉపాధ్యాయుల, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ఉపాధ్యాయ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణపై బుధవారం కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఫ్‌ఏపీటీఓ) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘురామరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల పరిరక్షణనను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రైవేటు రంగానికి ఊతం ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు మూతపడేవిధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికి 54 శాతం ప్రభుత్వం పాఠశాలల్లో, కళాశాలల్లో మరుగుదొడ్లు లేని దుస్ధితి ఉందన్నారు. 20 శాతం పైగా పాఠశాలల్లో తాగునీరు, ప్రహారీలు లేవన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులుకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. పీఆర్‌సీ అమలు చేయడానికి వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల పనివేళలను పునసమీక్షించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్నారు.
అనంతరం ఉపాధ్యాయులకు సంబంధించి 16 డిమాండ్లు, పాఠశాలలకు సంబంధించి 9 డిమాండ్లుతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌కు అందజేశారు. ఏపీటీఎఫ్ నాయకులు నరసింహులు, రామచంద్ర, ప్రభాకర్, వెంకటేష్, వీటీఎఫ్ నాయకులు జిలాన్, నాగేంద్ర, కోటేశ్వరప్ప, ఎస్టీయూ నాయకులు రామన్న, గోవిందు, సూరిడు, సూర్యనారాయణగౌడ్, ఏపీటీఎఫ్ (1938) నాయకులు వెంకటసుబ్బయ్య, జయరాంనాయక్, హెచ్‌ఎంఏ నాయకులు చలపతి రమణారెడ్డి, ఆర్‌యూపీపీ నాయకులు ఎర్రిస్వామి, తులసిరెడ్డి, సంజీవకుమార్, నాగరాజు, ఎస్సీఎస్టీయూఎస్ నాయకులు పెద్దన్న, డీటీఎఫ్ నాయకులు జార్జీ, సుబహాన్‌లతో పాటు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొన్నారు.