రాష్ట్రాలు బలంగా ఉంటేనే ‘సమాఖ్య’ పటిష్టం! | if states strong, then united system can be strong, says BV raghuvulu | Sakshi
Sakshi News home page

రాష్ట్రాలు బలంగా ఉంటేనే ‘సమాఖ్య’ పటిష్టం!

Published Wed, Oct 16 2013 1:44 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

రాష్ట్రాలు బలంగా ఉంటేనే ‘సమాఖ్య’ పటిష్టం! - Sakshi

రాష్ట్రాలు బలంగా ఉంటేనే ‘సమాఖ్య’ పటిష్టం!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలు బలంగా ఉంటేనే సమాఖ్య వ్యవస్థ బలపడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు సోమవారం సీపీఎం కార్యాలయంలో రాఘవుల్ని కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణ్‌రెడ్డి, నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల మాజీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, ఎస్‌కే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ముత్యాల నాయుడు, ప్రముఖ న్యాయవాది వి.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, సమైక్యత కోసం రాష్ట్ర పరిరక్షణ వేదిక చేస్తున్న కృషికి మద్దతు పలికారు. వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతపై సీపీఎం, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, బొత్స సత్యనారాయణ సానుకూలత ప్రకటించారని చెప్పారు.
 
 
  తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా, అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియను ప్రారంభించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇదే విషయాన్ని రాఘవులుకు వివరించామని తెలిపారు. త్వరలో టీడీపీ, లోక్‌సత్తా నేతల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ను కలిసి తమ ఉద్యమానికి మద్దతు ఇమ్మని కోరనున్నట్టు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు కేంద్రం బలంగా ఉండాలని, రాష్ట్రాలు చిన్నవిగా బలహీనంగా ఉండాలని కోరుకుంటున్నాయని, ఈ వైఖరిని ఖండించాలని ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు ఇప్పటికైనా తమ మంత్రిపదవులకు రాజీనామాలు ఇచ్చి సమైక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని డిమాండ్ చేశారు.
 
 వైఎస్సార్‌సీపీ సభకు అనుమతి ఇవ్వాలి
 ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, అందుకు వైఎస్సార్‌సీపీ కూడా మినహాయింపు కాదని రాఘవులు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఈనెల 19న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఏపీఎన్జీవోలు, కాంగ్రెస్, బీజేపీ, టీజేఏసీ సభలకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ సభకూ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇంతకుమించి వ్యాఖ్యనించలేనని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement