విద్యార్థినికి గోల్డ్ మెడల్ బహూకరిస్తున్న మంత్రి గంటా
కడప సిటీ/వేంపల్లె: ‘కృషి నీ ఆయుధమైతే విజయం నీకు బానిస’ అన్న జాతిపిత మహాత్మగాంధీ మాటలను ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీ విద్యార్థి గుర్తించుకుని ముందుకు సాగా లని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. శుక్రవా రం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2012–18 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, చాన్సలర్ రాజిరెడ్డి, వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, డైరెక్టర్ అమరేంద్రకుమార్ పండ్ర తదితరులు హాజరై పట్టాలు పొందిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు.
అనంతరం వారు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలు వరం లాంటివన్నారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రం లో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు నడుస్తున్నాయన్నారు. ప్రతి ట్రిపుల్ ఐటీలో ప్రతి ఏడాది 6 వేలమంది విద్యార్థులకు ఇక్కడ చదివేందుకు అవకాశం వస్తోందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు 4 శాతం వెయిటేజీ మార్కులు కలుపుతున్నామన్నారు. అయినప్పటికి చివరి సీటు సాధించిన విద్యార్థికి కూడా 10 జీపీఏ పాయింట్లు సాధించిన వారే ఇక్కడ విద్యనభ్యసించడం జరుగుతోందన్నారు. ఆరేళ్ల సమీకృత కోర్సుకు సంబంధించి విద్యార్థులకు ల్యాప్‌టాప్, భోజన వసతి, వసతి, యూనిఫాం తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.
మరో రెండు ట్రిపుల్ ఐటీలు
ప్రధానంగా ట్రిపుల్ ఐటీలలో బాలికలకు 65శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. 1985లో తాను ఆంధ్రా యూనివర్సిటీలో పట్టా తీసుకున్నానని, ఆ నాటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయన్నారు. పట్టాలు తీసుకోవడంతోనే సరిపోదని, ఇంకా లాంగ్ జర్నీ ఎంతో ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రిపుల్ ఐటీల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. మరో రెండు కొత్త ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని వెల్లడించారు. 2008లో ప్రొఫెసర్ రాజిరెడ్డి ఈ ట్రిపుల్ ఐటీలకు రూపకల్పన చేశారన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్‌లో 17శాతం ఖర్చు చేస్తోందన్నారు. ఎడ్యుకేషన్ ఆఫ్ నాలెడ్జి హబ్‌గా వీటిని మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాన చుక్క పడే స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుందని, ఆల్చిప్పలో పడితే ముత్యమవుతుందని, అటువంటి ఆల్చిప్పగా ట్రిపుల్ ఐటీని ఆయన అభివర్ణించారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలన్నారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు.
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..
మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మా ట్లాడుతూ మిమ్ములను చూస్తే స్టూడెంట్–1 సినిమా గుర్తుకు వస్తోందన్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పె రిగి.. ఇక్కడే చదివాం అన్నట్లుగా ఉందని, బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ, సుందర్ పిచ్చయ్‌లను ఆదర్శంగా తీసుకుని చదవాలన్నారు.
భావి శాస్త్రవేత్తలు ఎదగాలి
చాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ప్రయోగాలతో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌సిస్టర్ రేడియో, డిస్కవరీ, రోబోస్టిక్స్ తదితర వినూత్న ప్రయోగాలపై శ్రద్ధ చూపి దేశాభివృద్ధికి పాటుపడటంతోపాటు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రతి విద్యార్థికి ఇక్కడ చదువుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, సద్వి నియోగం చేసుకోవడమే మీ వంతు అన్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామన్నారు. రాబోయే రోజులలో మరింత ఖ్యాతిని గడించేలా క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని ముందుంచుకుని ముందుకు సాగాలన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు, ఫ్యాకల్టీకి నగదు బహుమతులతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment