అక్రమంగా దోచేస్తున్నారు!
► లేఅవుట్‌కు ఏలాంటి అనుమతులు లేకుండానే అమ్మకాలు
► పాలకులతో కలిసి అధికారుల చేతివాటం?
15ఏటీపీసీ01ఏ– రాచానపల్లి వద్ద అనుమతి లేకుండా వెలసిన వెంచర్
15ఏటీపీసీ01బీ– ఏలాంటి పంచాయతీ అనుమతి లేకుండానే రాచానపల్లి గ్రామం వద్ద ప్లాట్లు అమ్మకానికి కలవు అని బోర్డు పెట్టిన దృశ్యం
అనంతపురం రూరల్: అనంతపురంలో అక్రమ లేఅవుట్ల అడ్డులేకుండా పోతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న లేఅవుట్ అనంతపురం రూరల్ మండల పరిధి రాచానపల్లి పొలంలో బళ్లారి ప్రధాన రహదారి పక్కనే వున్న సర్వే నెంబర్ 5లో వెలిసింది. ఈ లేఅవుట్‌కు ఏలాంటి పంచాయతీ అనుమతి లేదు. అయితే ఏం? యాథేచ్చగా స్థలానికి పేరు పెట్టేసి స్థలాన్ని అమ్మకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై రాచానపల్లి పంచాయతీ కార్యదర్శి నాగక్రిష్ణయ్య వివరణ కోరగా ‘ల్యాండ్ స్కేప్ లేఅవట్’కు పంచాయతీ నుంచి ఏలాంటి అనుమతి తీసుకోలేదు.. క్రయ విక్రయాలు జరపకుండా నోటీసు బోర్డును వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు.
పాలకులతో కలిసి అధికారుల చేతివాటం?: పంచాయతీ అనుమతి ఖచ్చితంగా తీసుకుంటే లేఅవుట్ మొత్తం స్థలంలో 10శాతం స్థలాన్ని పంచాయతీ పేరిట ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు 10శాతం స్థలాన్ని ప్రజాప్రయోజనాల దృష్ట్య ప్రజల అవసరాల కోసం ఖాళీ స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కొందరు పంచాయతీ అధికారులు స్థానిక సర్పంచ్‌లతో కలిసి లేఅవుట్ల యజమానుల నుంచి బహిరంగంగా అందిన కాటికి దోచుకుంటున్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే బాగుందంటూ లేఅవుట్ యజమానులు సైతం వారి బాటలోనే పయనిస్తూ... పంచాయతీ అనుమతి ఉందంటూ బోర్డులను సైతం ఏర్పాటు చేసుకొని స్థలాలను అమ్మేసుకుంటూ సోమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి లేఅవుట్ల అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు: అనంతపురం రూరల్ మండల వ్యాప్తంగా గతంలో 42లేఅవుట్లు అక్రమ లేవుట్లు ఉన్నట్లు ఉన్నతాధికారులు లెక్కలు తేల్చారు. వాటిలో నోటీసు బోర్డులను ఏర్పాటు చేసి పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టే పనులను చేయాలని స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేశారు. అయితే గతంలో లేఅవుట్ల యజమానులతో అధికారులు లాలూచి పడడంతో తూతూ మంత్రంగా వారికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తప్ప పంచాయతీ అదాయం రాబట్టడంతో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో లేఅవుట్ల యజమానులు యధేచ్చగా స్థలాలను అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటు వెళ్లిపోతున్నారు. పంచాయతీ అనుమతి ఉందని గుడ్డిగా నమ్మి స్థలాలను కొనుగోలు చేసిన కొనుగోలు దారులు అనుమతి కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి స్థలం విలువలో 14శాతం అదనంగా చెల్లించి అనుమతి తీసుకుంటూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అక్రమ లేఅవుట్లలో నోటీసులు బోర్డులను ఏర్పాటు చేసి అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఈఓఆర్‌డీ లక్ష్మినరసింహా అన్నారు.