రాజాం: రాజాం పట్టణం ఆర్థికంగా ఎదుగుతోంది.. అంతకుమించిన స్థాయిలో రియల్ వ్యాపారం రెక్కలు విచ్చుకుంటోంది.. రెచ్చిపోతోంది. అడ్డూఅదుపూ లేకుండా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటి వల్ల అధికారులు, రియల్టర్లు లక్షలు కళ్లజూస్తుండగా.. కొనుగోలుదారులు మాత్రం కళ్లు తేలేయాల్సి వస్తోంది. పారిశ్రామికంగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన రాజాం పట్టణంలో వాణిజ్య, విద్యా రంగాల అభివృద్ధీ జోరందుకుంది. ఫలితంగా జనాభా, దానికి అనుగుణంగా ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నాయి.దీన్నే రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, పన్నులు చెల్లించకుండా వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. ఈ విధంగా రాజాం నగర పంచాయతీ పరిధిలో 17 చోట్ల సుమారు 60 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలసినట్లు తెలిసింది.
నిబంధనలకు సమాధి
రియల్టర్ల ధన దాహానికి వ్యవసాయ భూములు కరిగిపోతున్నాయి. నిబంధనలకు సమాధి కట్టి వాటి పునాదులపై అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చాలన్నా, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాలన్నా నాలా పన్ను చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. కాగా లేఅవుట్లు వేసిన ప్పుడు వాటిలో రహదారులు, కాలువలు, విద్యుత్ లైన్లు వేయడంతోపాటు కమ్యూనిటీ హాలు వంటి వాటిని స్థలం కేటాయించి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి పొందిన తర్వాతే విక్రయాలు జరపాలి. కానీ రియల్టర్లు వీటిని పట్టించుకోకుండా హద్దులుగా రాళ్లు పాతి, స్థలాలు చూపించి అమ్మేస్తున్నారు. నిబంధనలపై అవగాహన లేని ప్రజలు వీటిని కొనుగోలు చేసి, ఆ తర్వాత ఇబ్బందులపాలవుతున్నారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన నగర పంచాయతీ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు.
ఇవే అక్రమ లేఅవుట్లు
విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుమతుల్లేని లేఅవుట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
వాసవీనగర్ సర్వే నెం. 31, 40లలో ఎకరా విస్తీర్ణంలో 18 ప్లాట్లు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక పాపయ్యపేట వద్ద సర్వే నెం. 107లో రెండు ఎకరాల్లో 40 ప్లాట్లు. పొనుగుటివలసలో సర్వే నెం.33లో 4 ఎకరాల్లో 90 ప్లాట్లు. పొనుగుటివలస గౌరీపరమేశ్వర ఆలయం వద్ద సర్వే నెం. 20, 21, 13, 14లలో 102 ప్లాట్లు. ఇదే గ్రామంలో జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా సర్వే నెం. 76, 78లలో 8 ఎకరాల్లో 170 ప్లాట్లు.
జీఎంఆర్ కేర్ ఆస్పత్రి ఎదురుగా బుచ్చింపేట రహదారిలో సర్వే నెం. 84, 86,88లలో 10 ఎకరాల్లో 230 ప్లాట్లు.
పొనుగుటివలస రోడ్డులో ఒక ఎకరాలో 18 ప్లాట్లు. ఇదే ప్రాంతంలో సర్వే నెం. 170, 173, 176లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు. సారధి గ్రామంలో చీపురుపల్లి రోడ్డులో సర్వే నెం.119లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. ఇదే రోడ్డులో నర్సింగ్ పాఠశాల ఎదురుగా సర్వే నెం. 181లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. బొబ్బిలి రోడ్డులో అగ్నిమాపక కేంద్రం పక్కన సర్వే నెం. 70లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. ఇదే రోడ్డులో ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా సర్వే నెం.84లో ఎకరా విస్తీర్ణంలో 18 ప్లాట్లు. కొత్తవలస సర్వే నెం. 37లో 5 ఎకరాల్లో 60 ప్లాట్లు. ఇదే గ్రామంలో సర్వే నెం. 66లో హెచ్‌పీ పెట్రోల్ బంకు వెనుక 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. కొండంపేట సర్వే నెం. 113, 117లలో ఇటుకల ఫ్యాక్టరీ ఎదురుగా 4 ఎకరాల్లో 124 ప్లాట్లు.
బొబ్బిలి రోడ్డులో సర్వే నెం. 70, 73లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు.
ఇదే రోడ్డులో సర్వే నెం.132, 138, 140, 145లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు చర్యలు తీసుకుంటాం
అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయిస్తున్న విషయాన్ని నగర పంచాయతీ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించగా వాస్తవమేనన్నారు. వీటిని గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. నిర్మాణాలు చేపట్టేటప్పుడు నిబంధనలు పాటించి, అవసరమైన అనుమతులు పొందితే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.
రియల్ రాజ్యం!
Published Sun, Oct 26 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement
Advertisement