అనంతపురం కార్పొరేషన్ :అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ప్లాన్ అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. సెట్ బ్యాక్ అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. దీని సంగతి అటుంచి ఏకంగా రోడ్డు, కాలువ స్థలాలను ఆక్రమిస్తూ ర్యాంప్‌ల నిర్మాణం వంటివి చేపడుతున్నారు. కొన్ని చోట్ల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం (సెల్లార్)లో కూడా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు.
సెంటు లేదా ఒకటిన్నర సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకునేవారిపై తమ అధికార పెత్తనాన్ని చూపించే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అనుమతులకు విరుద్ధంగా బడాబాబులు నిర్మిస్తున్న భవనాలు, అపార్టుమెంట్ల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి నుంచి అన్ని స్థాయిల్లో ముడుపులు ముడుతుండడంతోనే ఆ వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల సెట్ బ్యాక్ స్థలాన్ని వదలకుండా రోడ్డు మీదకు వచ్చేలా భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వచ్చినా, విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినా ఆ తక్షణమే స్పందించినట్లు వ్యవహరించి మొక్కుబడిగా కేసుల నమోదుతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యల జోలికి వెళ్లడం లేదు.
తప్పించుకునే మార్గాలూ వీరే చూపుతారు
అక్రమ నిర్మాణాల గురించి అధికారులు ప్రశ్నిస్తే టౌన్‌ప్లానింగ్ సిబ్బంది హుటాహుటిన వెళ్లి మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ గండం నుంచి తప్పించుకునే మార్గాలను అక్రమ నిర్మాణానికి పాల్పడిన భవన యజమానికి తెలియజే స్తున్నారు. కొద్ది రోజుల క్రితం కమలానగర్‌లో ఇదే చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో అనుమతులకు విరుద్ధంగా ఒక భవన నిర్మాణం జుగుతున్నట్లు ఆర్‌డీఎంఏకి ఫిర్యాదు వెళ్లింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో వారు అక్రమ కట్టడం వద్దకు వెళ్లి తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. కోర్టుకు వెళ్లాలని సదరు యజమానికి ఉచిత సలహా ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన కోర్టు వెళ్లారు. ఏంటి ప్రస్తుత పరిస్థితని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే కోర్టులో ఉందని చల్లగా చెప్పి జారుకుంటున్నారు.
అక్రమార్జన
అపార్టుమెంట్లు, భారీ భవనాల నిర్మాణం ఇక్కడి అధికారులకు కాసులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. ప్లాన్ అప్రూవల్ కావాలంటే అన్ని స్థాయిల్లోనూ ముడుపులు ఇచ్చుకుంటే తప్ప చేతికంద దని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ కట్టడాల నిర్మాణానికి చెక్ పెట్టాలంటే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి తనిఖీలు చేస్తుండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాల మేడలు
Published Mon, Jun 23 2014 2:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement