రక్షకుడే.. భక్షకుడై | Illigal activites by police | Sakshi
Sakshi News home page

రక్షకుడే.. భక్షకుడై

Published Tue, Aug 25 2015 3:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:04 PM

రక్షకుడే.. భక్షకుడై - Sakshi

రక్షకుడే.. భక్షకుడై

ఆ ఎస్‌ఐకు జీతం కంటే గీతంపైనే దృష్టి...

- ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నిర్వాకం
- కేసులో అనుమానితుడి నుంచి బలవంతంగా లక్షల రూపాయల వసూలు
- తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు
- కాళ్ల బేరానికి వెళ్లిన సబ్ ఇన్‌స్పెక్టర్
- రాజీకి ఒప్పుకోని బాధితుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
ఆ ఎస్‌ఐకు జీతం కంటే గీతంపైనే దృష్టి. అమాయకులను టార్గెట్ చేసి విచారణ పేరుతో ప్రైవేట్‌గా నిర్భందిస్తాడు. కేసుల్లో ఇరికిస్తానని భయపెట్టి రూ.లక్షలు గుంజేస్తాడు. కరుడు గట్టిన దొంగను మరిపిస్తున్నాడు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, అన్యాయం చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని నిర్బంధించి తనదైన శైలిలో చుక్కలు చూపించాడు. తట్టుకోలేక డిమాండ్ చేసిన రూ.5 లక్షలు ఆ వ్యక్తి ఎస్‌ఐకు ముట్టజెప్పాడు. అనంతరం బాధితుడు ఆ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. సదరు ఎస్‌ఐ బాధితుడి వద్దకు వెళ్లి కాళ్ల బేరానికి దిగాడు. రాజీకి రాకపోవడంతో ఆ ఎస్‌ఐ చుక్కలు చూస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని తిరుపతి ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఓ బ్లూకోల్ట్ కానిస్టేబుల్‌తో కలసి ఓ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నాడు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఓ ప్రైవేటు గదిలో మూడు రోజులపాటు బంధించాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తామని భయపెట్టాడు. భయపడి ఆ వ్యక్తి డబ్బు సమకూర్చి బయటపడ్డాడు. బాధితుడి బంగారు ఉంగరాన్ని కానిస్టేబుల్ తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ కుదవ అంగడిలో ఉంగరాన్ని పెట్టి నగదు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం బాధితుడు అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు.

దీనిపై నిఘా వర్గాలతో ఎస్పీ విచారించగా సదరు ఎస్‌ఐదే తప్పని తేలడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్‌ఐని పిలిపించారు. రాజీ కుదుర్చుకో.. లేదంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బెంబేలెత్తిన ఎస్‌ఐ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి డబ్బు తీసుకుని బాధితుని వద్దకు వెళ్లి రాజీ కావాలంటూ కాళ్లవేళ్ల పడ్డారు. వారు పెట్టిన బాధలు విడమరిచి చెబుతూ తనను అన్యాయంగా హింసించారని, రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆ ఎస్‌ఐ ఇప్పటికే రెండుమార్లు సంప్రదింపులు జరిపారు. అయినా బాధితుడు రాజీకి రాకపోవడంతో ఏమిచేయాలో తెలియక సదరు ఎస్‌ఐ కాలుకాలిన పిల్లిలా అధికారుల చుట్టూ తనను కాపాడండి అంటూ ప్రదక్షణలు చేస్తున్నట్లు సమాచారం.
 
ఫిర్యాదు అందింది వాస్తవమే హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది వాస్తవమే. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించా. మాకు అందిన ఫిర్యాదులో బాధితుని నుంచి ఎస్‌ఐ డబ్బు తీసుకున్నట్లు లేదు. తప్పు చేస్తే ఎంతటివారినైనా క్షమించేది లేదు. చర్యలు తప్పకుండా తీసుకుంటాం.   
- గోపీనాథ్‌జెట్టి, అర్బన్ జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement