దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయి. దేశ ఈశాన్య భాగంలో ఉన్న ప్రిటోరియాను పరిపాలన రాజధానిగా, నైరుతి భాగాన ఉన్న కేప్‌టౌన్‌ను శాసన రాజధానిగా, దేశానికి మధ్య భాగంలో ఉన్న బ్లోమ్‌ఫౌంటేన్‌ను న్యాయ రాజధానిగా చేశారు. పరిపాలనా రాజధాని ప్రిటోరియాలో దేశ అధ్యక్షుడు, మంత్రి మండలితోసహా ప్రభుత్వ విభాగాల కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. శాసన రాజధాని కేప్‌టౌన్‌లో ఆ దేశ పార్లమెంట్ ఉంది. న్యాయ రాజధానిగా ఉన్న బ్లోమ్‌ఫౌంటేన్‌లో సుప్రీం కోర్టు ఏర్పాటు చేశారు.
సాక్షి, అమరావతి: బహుళ రాజధానుల వ్యవస్థ.. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో మంగళవారం చేసిన ప్రకటనతో ఈ అంశం జాతీయ స్థాయిలో ప్రధానంగా తెరపైకి వచ్చింది. ‘దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయి. మనమూ మారాలి. వికేంద్రీకరణ ఉత్తమం’ అని ఆయన స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో ‘రాజధాని అంటే ఒకటే ఉండాలా.. ఒకటికి మించి ఉండాలా’ అన్న విషయంపై మేధావులు, నిపుణుల నుంచి సామాన్యుల వరకు చర్చోపచర్చలు జరుపుతున్నారు. అధికార వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ.. ప్రాంతీయ అసమానతలను పారదోలుతూ.. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థ మూల స్తంభంగా నిలుస్తోందని ప్రపంచ వ్యాప్తంగా పలు దృష్టాంతాలు స్పష్టీకరిస్తున్నాయి. ఉమ్మడి రాజధానిలో మొత్తం అధికార వ్యవస్థలను, అభివృద్ధిని హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడంతో రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులనూ ప్రస్తావిస్తున్నారు.
విజయవంతంగా బహుళ రాజధానుల విధానం
ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి సాధించిన యూరోపియన్ దేశం నెదర్లాండ్స్‌లో కూడా రెండు రాజధానులు ఉన్నాయి. దేశానికి ఉత్తరాన ఉన్న ఆమ్‌స్టర్‌డామ్ నగరం శాసన రాజధానిగా ఉంది. ఆ నగరంలోనే పార్లమెంట్ ఉంది. దేశానికి దక్షిణాన ఉన్న ‘ద హేగ్’ నగరం పరిపాలనా రాజధానిగా ఉంది. అందులో ప్రభుత్వ అధికార యంత్రాంగం, సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు.
– ఆగ్నేయాసియా దేశం మలేషియాలో రెండు రాజధానులు ఉన్నాయి. కౌలాలంపూర్, పుత్రజయ నగరాల్లో రాజధాని ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1957 నుంచి 2001 వరకు కౌలాలంపూర్ రాజధానిగా ఉండేది. కాగా పెరుగుతున్న అవసరాలు తీర్చడంతోపాటు, ప్రాంతీయ సమాన అభివృద్ధి కోసం 2001లో అప్పటి దేశ అధ్యక్షుడు మహతీర్ మహ్మద్ పుత్రజయ నగరాన్ని నిర్మించి రెండో రాజధానిగా చేశారు. కౌలాలంపూర్.. పార్లమెంట్‌తో పాటు దేశానికి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. పుత్రజయ నగరాన్ని పరిపాలన, న్యాయ వ్యవస్థలకు రాజధానిగా చేశారు.
– చిలీ, శ్రీలంక, యమన్, టాంజానియా, బెనిన్, బొలీవియా, బరుండీ, జెక్ రిపబ్లిక్, హండూరస్, ఇస్వటినీ, మాంటెనెగ్రో, పశ్చిమ సహారా, కోట్ డివోర్ దేశాల్లో రెండేసి రాజధానులు ఉన్నాయి.
దేశంలో పలు రాష్ట్రాల్లో రెండేసి ప్రధాన కేంద్రాలు
మన దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ద్వి రాజధాని వ్యవస్థ కొనసాగుతోంది. శాసన, పరిపాలనా రాజధానిగా ఓ నగరం, హైకోర్టు కేంద్రంగా న్యాయ రాజధానిగా మరో నగరంలో ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రజల సౌలభ్యం కోసం హైకోర్టు బెంచ్‌లను మరో నగరంలో ఏర్పాటు చేశారు.
ఏపీలో అధికార వికేంద్రీకరణే మేలు
రాష్ట్రంలో అధికార వ్యవస్థను వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజధాని ప్రాంతం ఎంపికపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో వివిధ రంగాల నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ అధికార వ్యవస్థలను నవ్యాంధ్రప్రదేశ్‌లో ఒకే చోట ఏర్పాటు చేయకుండా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాలని ఆ కమిటీ స్పష్టంగా సూచించింది. కానీ ఆ కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని అధికార వ్యవస్థలను ఒకేచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు ఆజ్యం పోసింది.
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసే దిశగా యోచిస్తోంది. ‘ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్టణం పరిపాలనా రాజధానిగా సరిపోతుంది. అటు కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడం పట్ల రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక రాగానే బాగా పరిశీలించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆయన మాటలకు జనామోదం లభిస్తోంది.
శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల్లో కొన్ని...
– ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు.
– రాష్ట్రంలో రాజధానిని వికేంద్రీకరించాలి.
– అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ వ్యవస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
– విజయవాడ– గుంటూరు, విశాఖపట్టణం కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి– నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
– శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్‌ను నెలకొల్పాలి.
– విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే సారవంతమైన భూములు నాశనమై ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది.
– ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ప్రభుత్వ అధికార వ్యవస్థలను విస్తరించాలి. కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న భూముల వివరాలు అడిగినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇవ్వకపోవడం దురదృష్టకరం.
– విజయవాడ– గుంటూరు నగరాల మధ్య ప్రాంతాన్ని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి (చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు.
– విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పోలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
– సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జల మట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప క్షేత్రం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా అక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
– అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి.
Comments
Please login to add a commentAdd a comment