
చిక్కుల్లో చక్కెర
►తుమ్మపాల కర్మాగారానికి నిధులిచ్చేందుకు ఆప్కాబ్ వెనుకంజ
►చక్కెర కర్మాగారాల రుణానికి గ్యారంటీ ఇవ్వని ప్రభుత్వం
►సహకార రంగంపై సవతి తల్లి ప్రేమ
►ఇచ్చిన మాట నిలబెట్టుకోని బాబు
►ఎన్నికల హామీపై ఎమ్మెల్యే పిల్లిమొగ్గలు
►అప్పుల్లో రైతులు.. ఆందోళనలో సుగర్ ఉద్యోగులు
అనకాపల్లి: చెరకు ఉత్పత్తుల్లో ఒక్కటైన బెల్లం లావాదేవీల్లో జాతీయ స్థాయి కీర్తిని ఆర్జించిన అనకాపల్లి.. చక్కెర కర్మాగారం విషయంలో మాత్రం అవస్థల పాలవుతోంది. మాటల గారడీతో గద్దెనెక్కిన పాలకులు ఇంకా రైతుల్ని మాయ మాటలతో మోసం చేస్తున్నారు. సహకార రంగానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు రుణం వచ్చే విషయంలో గ్యారంటీ కూడా ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. ఏడాది క్రితం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన మాటకు విలువలేకుండా పోయింది. ఎన్నికల ముందు తుమ్మపాల కర్మాగారం ఆధునీకరణ తన లక్ష్యమని చెప్పుకున్న టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత హామీని గాలికొదిలేశారు.
అప్పుకు సైతం నోచుకోని దయనీయ స్థితి : భవితవ్యంపై స్పష్టత లేని తుమ్మపాల కర్మాగార యాజమాన్యానికి అప్పు సైతం పుట్టడంలేదు. ఉన్న వనరులతో ఏదోలా నెట్టుకొద్దామని యాజమాన్యం భావిస్తున్నా పైసలు లేక తలలు పట్టుకుంది. ఆప్కాబ్ సహాయంతో కొద్దిగా రుణం పొందాలని అనుకున్నా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడంతో 3 కోట్ల రుణం మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది.
గానుగాటకు సన్నాహాలు లేవు: 2015-16 సీజన్‌కు సంబంధించి తుమ్మపాల కర్మాగారం పరిధిలో గానుగాటకు సన్నాహాలు మొదలుకాలేదు. ఖజానాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో ఎటువంటి కదలిక లేకుండా పోయింది. గానుగాటకు ముందు ఓవర్‌హాలింగ్ చే యాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో యాజమాన్యం చేతులెత్తేసింది. కనీసం 70లక్షల రూపాయిల నిధులుంటేనే ఓవర్‌హాలింగ్ సాధ్యమవుతుంది. గత ఏడాది ఓవర్‌హాలింగ్ కో సం వినియోగించిన సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ. 50 లక్షలు ఇం కా యాజమాన్యం చెల్లించాల్సి ఉంది.
కమిటీలతో కాలయాపన : చంద్రబాబు ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాల భవితవ్యం కోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించగా, కమి టీ నివే దికలు ఏమయ్యాయో తెలి యదు. తాజాగా ముగ్గురు మంత్రుల తో కూడిన ఉపసంఘం సహకార కర్మాగాల భవితవ్యంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుకోకుండానే కాలయాపన చేస్తోంది.
అప్పులు.. ఆందోళనలే.. : తుమ్మపాల కర్మాగారం ఆధునీకరణకు కనీసం రూ.800 కోట్లు అవసరమని యాజమాన్యం చెబుతోంది. అది కూడా కర్మాగారం ఏటా లక్ష టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తేనే సుగర్‌కేన్ డవలప్‌మెంట్ ఫోరం అనుమతిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండూ సాధ్యం కాదు. ఇక కర్మాగారంలో పనిచేస్తున్న 36 మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.60 లక్షల జీతాల బకాయిలు, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు రూ.కోటి బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన మద్దతు ధర బకాయిలు 3.56 కోట్ల వరకూ ఉ న్నాయి. కర్మాగారం భవితవ్యంపై స్పష్టత రాకపోవడంతో రైతులు అప్పుల్లో, ఉద్యోగలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఎమ్మెల్యే పిల్లిమొగ్గలు : ఎన్నికలకు ముందు పీలా గోవింద సత్యనారాయణ కర్మాగారం ఆధునీకరణే లక్ష్యమని చెప్పారు. పదవిలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఆయన దాటవేత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఆధునీకరణ చేయకుంటే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే తన మాటకు కట్టుబడాలని రైతులు అంటున్నారు. గత ఆగస్టు మొదటి వారంలో కర్మాగారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునీకరణకు సంబంధించిన కమిటీ వేసి త్వరలోనే తీపికబురు చెబుతామని నమ్మించినా ఇప్పటికీ ఏ కబురూ లేదు.