పల్లెలకు సుస్తీ..!
Published Mon, Dec 2 2013 2:30 AM | Last Updated on Tue, Oct 9 2018 7:08 PM
సాక్షి, గుంటూరు:ప్రజారోగ్యం మెరుగుదలకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కుమ్మరిస్తున్నా, వ్యాధుల నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్నడూ లేనంతగా జిల్లాలో వైరల్, చికున్ గున్యా జ్వరాలు విజృంభించాయి. తీవ్రమైన కీళ్ల నొప్పులతో సత్తువను హరించి వేశాయి. చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో మంచం పట్టారు. కిందటేడాది కంటే జ్వరాల వ్యాప్తి పది నుంచి పదిహేను శాతం అధికంగా నమోదైనట్లు జిల్లా ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది 50 శాత ం దాటినట్టు సమాచారం. ఈ దఫా మలేరియా, డెంగీ, గున్యా, వైరల్ జ్వరాలు ఒకే సారి విజృంభించడంతో ఈ వ్యాధుల బారిన పడిన వారు కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. జ్వరం నుంచి కోలుకోని నెలలు గడిచినా ఇప్పటికీ తీవ్రమైన ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
జ్వర పీడితులతో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగుల్లో 90 శాతం మంది ప్రయివేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులు అవసరం లేకున్నా టెస్టుల పేరుతో రకరకాల మందుల రాసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ జ్వరాల చికిత్సలతో గుంటూరు జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు అంచనా. ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయ లేమి వ్యాధుల తీవ్రతకు కారణమవుతోంది. కలుషిత తాగు నీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నియంత్రణకు ఫాగింగ్, పిచికారి యంత్రాలు లేకపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైద్యాధికారుల తప్పుడు నివేదికలు జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో రెండు లక్షల మందికి పైగా చికున్‌గున్యా బారిన పడ్డారు. తండాలు, మారుమూల పల్లెల్లో మాత్రమే కనిపించే మలేరియా కేసులు ఈ ఏడాది పట్టణాల్లోనూ అధికంగానే నమోదవుతున్నాయి.
వేలల్లో మలేరియా, వందల్లో డెంగీ కేసులను గుర్తించారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పల్లెల్లో జనం ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వ్యాధులపై జిల్లా వైద్యాధికారులు లెక్కలు చిత్రంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 12 మండలాల్లో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 72 గ్రామాల్లోనే జ్వరాలున్నట్లు నివేధించారు. మలేరియా కేసులు 410, డెంగ్యూ నిర్ధారిత కేసులు 16, చికున్ గున్యా కేసులు 42 కేసుల్ని మాత్రమే నిర్ధారించినట్లు ప్రకటించారు. ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో గృహ సందర్శనలు చేసి వ్యాధులపై ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంత స్థాయిలో వ్యాధులు ప్రబలితే, ఎస్పీఎం విభాగం సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతోనే జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యాధికారులు నివేదికల్లో పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది నవంబరు వరకు జిల్లాలో 5,35,672 రక్తపూతలు సేకరించామని చెబుతున్న అధికారులు చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగానే చూపడం లెక్కలపై అనుమానాలకు తావిస్తోంది.
ప్రజారోగ్యంపై ఏదీ.. చైతన్యం..
పల్లెల్లో వర్షపు నీరు.. చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు విజృంభిస్తున్నా నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రయత్నాలు మాత్రం సరిగా జరగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్‌సీ సబ్ సెంటర్లకు రూ.10 వేలకు పైగా నిధులు అందుతున్నాయి. కానీ ఈ నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఎన్‌ఎం, గ్రామ కార్యదర్శి సంయుక్త చెక్ పవర్‌తో ఈ నిధుల్ని ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే సమయంలోనే జిల్లాలోని రెవెన్యూ గ్రామ పంచాయితీలు 1,021కి శానిటేషన్ నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్ని సక్రమంగా ఖర్చు చేసి ప్రజారోగ్యం మెరగుదలకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో 226 వైద్య శిబిరాలు నిర్వహించామని, 33,906 మందికి వైద్య సేవలు అందించామని అధికారులు పేర్కొంటున్నారు. దోమల నియంత్రణకు యాంటి లార్వాను గృహాల్లో, కాల్వల్లో మలాథియన్ ఫాగింగ్ చేశామని చెబుతున్నారు.
Advertisement
Advertisement