ఇసుక.. మస్కా ! | in district sales is Rs.18 crore 60 lakhs | Sakshi
Sakshi News home page

ఇసుక.. మస్కా !

Published Fri, Feb 6 2015 1:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

ఇసుక.. మస్కా ! - Sakshi

ఇసుక.. మస్కా !

మహిళా సంఘాలకు మిగిలేది మట్టే
పేరు మహిళలది- ఆదాయం ప్రభుత్వానిది
జిల్లాలో అమ్మకాలు రూ.18 కోట్ల 60 లక్షలు
మహిళలకు ఇచ్చింది నామమాత్రమే

 
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ ప్రభుత్వం ప్రచారం సాగించింది. ఇందుకోసమే ఇసుక రీచులను సంఘాలకు అప్పజెప్పుతున్నామంటూ అధికార పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారు. అరుుతే వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నారుు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖాజానాకు రూ. కోట్లు చేరుతుంటే మహిళా సంఘాలకు మాత్రం మట్టే మిగులుతుంది. మరోవైపు పంచాయతీలకు చేరాల్సిన సీనరీజ్ చార్జీలు అందించకుండా ఖజానాకే మళ్లిస్తున్నారు. కనీస సౌకర్యాలు లేని మహిళా సంఘాల సభ్యులు అర్ధరాత్రి వరకు ఇసుక ర్యాంపుల్లో అవస్థలు పడుతున్నారు.
 
పాలకొండ : జిల్లాలో గత ఏడాది అక్టోబర్ పదో తేదీ నుంచి ఇసుక రీచులు అమల్లోకి వచ్చారుు. 13 రీచులను ఏర్పాటు చేయడం ద్వారా ఇంతవరకు 2,75,565 క్యూబిక్ మీటర్ల ఇసుకను 27,985 మంది కొనుగోలుదారులకు విక్రయించారు. దీని ద్వారా ప్రభుత్వం 18 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 4 కోట్ల 90 లక్షల 50,570 రూపాయలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ చార్జీల కింద చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలం ఇసుక లోడింగ్‌కు, ర్యాంప్‌ల నిర్వహణకు మినహాయిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వ ఖాజానాకు మళ్లించారు.

ఇవీ నిబంధనలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా నదిలో యంత్రాలతో పనిచేసే ఇసుక రీచులకు మహిళా సంఘాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.15 చొప్పునివ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఇప్పటివరకు వీరికి రూ. 41 లక్షల 33,475 చెల్లించాల్సి ఉంది. ఇందులో కొంతమేర ఇప్పటికే బిల్లుల రూపంలో చెల్లించారు. ఈ మొత్తాన్ని మహిళా సంఘాలు పంచుకుంటే కేవలం నెలకు రూ. 2 వేల నుంచి 4 వేల రూపాయలు మాత్రమే పడుతుందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇసుక లోడింగ్‌లు నిలిపివేయాలి. రీచుల వద్ద ఈ నిబంధన సాగడం లేదు. ఉదయం నుంచి మహిళలు అర్ధరాత్రి వరకు రీచుల వద్దే ఉండాల్సి వస్తుంది.

పంచాయతీలకు చేరని సీనరీజులు!

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున సంబంధిత పంచాయతీలకు సీనరైజ్‌ల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కోటి 10 లక్షల 600 రూపాయలు పంచాయతీలకు జమకావాల్సి ఉంది. దీన్ని ఇంతవరకు జమ చేయకుండా ప్రభుత్వ ఖజానాకు మళ్లించడంతోగ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పలు రీచులను నిలిపివేయాలని ఆందోళన చేపడుతున్నారు. ఇదే పరిస్థితిలో అల్లెన, ఆకులతంపర రీచులు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్నవి నాలుగే...

ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఏర్పాటు చేసిన 13 ర్యాంపుల్లో తలవరం, బద్దేరు, డొంపాక, కల్లేపల్లి రీచుల్లో నిల్వలు నిండుకోవడంతో నిలిపివేశారు. తమరాం ర్యాంప్‌లో పూర్తిగా అక్రమాలు చోటు చేసుకోవడంతో నిలిచిపోయింది. ఆకులతంపర రీచుపై అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకోవడం, పంచాయతీకి సీనరీజ్ చెల్లించకపోవడంతో ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి కాఖండ్యాం, యరగాం, పురుషోత్తపురం ర్యాంపుల్లో మాత్రం విక్రయాలు సాగుతున్నాయి.

అన్నింటికీ రూ.178

ప్రభుత్వం యంత్రాలతో నిర్వహించే ఇసుక రీచులకు క్యూబిక్ మీటర్‌కు రూ. 178 చొప్పున చెల్లించాలని నిబంధన విధించింది. జిల్లాలోని ర్యాంప్‌లన్నీ యంత్రాలతో నిర్వహించేవి కావడంతో క్యూబిక్ మీటర్‌కు రూ.178 చొప్పున అందించాల్సి ఉంది. ఇందులో లోడింగ్, మిషనరీ చార్జీలు కలిపి క్యూబిక్ మీటర్‌కు రూ.50, పంచాయతీ సీనరీజ్‌ల కింద రూ.40, ర్యాంప్‌లు ఏర్పాటు చేసుకొనేందుకు రూ.5, సీసీ టీవీలు, కంప్యూటర్లు తదితర ఏర్పాట్లుకు రూ.15, మహిళా సంఘాలకు కూలి కింద రూ.15, రవాణా చార్జీల కింద రూ.23, అడ్మినిస్ట్రేషన్, మోనటరింగ్‌కు తదితరమైన వాటికి రూ.30 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తంలో కేవలం ఇసుక లోడింగ్ చార్జీలకు, సీసీ టీవీల ఏర్పాటుకు నిధులు కేటాయించారు తప్పితే మిగతా వాటికి సంబంధించిన నిధులు ప్రభుత్వ ఖాజానకే మళ్లించారు.

ఏర్పాటు కాని సీసీ కెమెరాలు

ఒక్కర్యాంప్‌లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఇందుకోసం కేటాయించిన నిధులు ఖజానాలోనే ఉంచారు. కెమెరాలు లేకపోవడంతో ర్యాంప్‌ల వద్ద వాహనాలు గుర్తించడంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ సామాగ్రి అందించినా వీటి వినియోగంపై మహిళలకు అవగాహన లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఇంతవరకు దీని కోసం చెల్లించాల్సిన సుమారు రూ.45 లక్షలు ప్రభుత్వ ఖాజానాకు మళ్లించారు.

అక్రమాలకు నిలయం!

ఇసుక ధరలు అమాంతంగా పెంచేయడంతో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు కొదవ లేకుండాపోయింది. అనధికారికంగా ఇసుకను తరలించుకుంటూ కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన నాయకుల అనుచరగణం చేస్తున్న దురాగతాలపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తలవరంలో జరిగిన సుమారు రూ.40 లక్షల అక్రమాలపై దర్యాప్తు జరుగుతుండగా, తమరాం ర్యాంప్‌లో కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా తరలించేశారు. బూర్జ మండలంలోని అల్లెన ఇసుక ర్యాంప్‌లో కూడా ఎమ్మెల్యే పేరుతో జరుగుతున్న అక్రమాలపై లారీ డ్రైవర్లు సైతం ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement