కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కళ్లెదుటే కష్టమంతా కొట్టుకుపోతోంది. ఊహించని వర్షం అన్నదాతను నిలువునా మించుతోంది. చేతికొచ్చిన పంటలు నోటికి అందకుండా పోతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అల్పపీడన ద్రోణి జిల్లా రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆళ్లగడ్డలో మిద్దె కూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆదోని వ్యవసాయ మర్కెట్ యార్డులో విక్రయానికి ఉంచిన పత్తి తడిసి భారీ నష్టం వాటిల్లింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 10వేల ఎకరాల్లో వరి, 5వేల ఎకరాల్లో వేరుశనగ, మరో 2వేల ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. గూడూరు, కోడుమూరు, క్రిష్ణగిరి మండలాల్లో మినహా అన్ని చోట్లా ఒక మోస్తరు నుంచి అతి భారీ స్థాయిలో వర్షం కురిసింది. అత్యధికంగా శ్రీశైలంలో 105.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా వెల్దుర్తిలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద సగటున 24 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కారణంగా ఆత్మకూరు పరిధిలోని 4వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
కోత దశకు వచ్చిన సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. నందికొట్కూరులో మొక్కజొన్న రైతుల కష్టమంతా నీటి పాలైంది. రుద్రవరంలో భారీ వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దయింది. నంద్యాల, బండిఆత్మకూరు, గోస్పాడు, మహానంది మండలాల్లో జొన్న, వరి తదితర పంటలు 2వేల ఎకారల్లో దెబ్బతిన్నాయి. కొత్తపల్లి మండలంలో భారీ వర్షాల వల్ల సుద్దవాగు పొంగి వివిధ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వెలుగోడులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండపోతగా కురిసిన వర్షంతో శ్రీశైలంవాసులు విలవిల్లాడారు. ఆలయ వీధులు, లోతట్టు ప్రాంతాలను వర్షం నీరు చుట్టుముట్టింది.
చినుకు.. వణుకు
Published Thu, Oct 24 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement