రాష్ర్టం విభజనదిశగా సాగుతున్న తరుణంలో రాయలసీమ, ఆంధ్రాప్రాంతానికి చెందిన ప్రజలకు నెలకొన్ని ఉన్న కొన్ని అనుమానాలు, భయాందోళనలపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది.
కేంద్రానికి ఏపీ జర్నలిస్ట్స్ ఫోరం సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టం విభజనదిశగా సాగుతున్న తరుణంలో రాయలసీమ, ఆంధ్రాప్రాంతానికి చెందిన ప్రజలకు నెలకొన్ని ఉన్న కొన్ని అనుమానాలు, భయాందోళనలపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం (ఏపీజేఎఫ్) ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. నీటి పంపకాలు, హైదరాబాద్ స్థాయిలో రాజధాని ఏర్పాటు, హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రల భద్రతకు ప్రత్యేక చట్టం తదితర అంశాలపై కేంద్రం హామీ ఇవ్వాలని ఫోరం పేర్కొంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 30లక్షల మంది ప్రజలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని, వారి భద్రతకు కూడా ప్రత్యేక చట్టం కల్పించాలని సూచించింది. హైదరాబాద్‌లో ఎన్నో జాతీయస్థాయి వైద్య, విజ్ఞాన పరిశోధనా సంస్థలు నెలకొని ఉన్నాయని, సీమాంధ్ర ప్రాంతంలోనూ ఇలాంటి సంస్థలను కేంద్రమే ముందుండి నిర్మించాలని ఫోరం కన్వీనర్ కె.సురేష్‌బాబు పేర్కొన్నారు. త్వరలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నివేదికతో ఆంటోని కమిటీని కలవనున్నట్లు తెలిపారు. ఇటీవలే ఏర్పడిన ఈ ఫోరం సలహాదారుగా కొమ్మినేని శ్రీనివాసరావు,అడ్‌హాక్ కమిటీ సభ్యులుగా విజయ శైలేంద్ర, రెహానా బేగం, ఎం.వంశీకృష్ణ, జి.రామచంద్రారెడ్డి, సీహెచ్ కృష్ణాంజనేయులు రమేష్‌లు ఉన్నారు.