
అంతన్నారింతన్నారు!
అది 2013 మార్చి 17.. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు జయరాం రమేష్, కిశోర్‌చంద్రదేవ్...
- మన్యంలో అట్టహాసంగా శంకుస్థాపనలు
- నెరవేరని ‘నల్లారి’ వారి హామీలు
- పూర్తికాని అభివృద్ధి పనులు
- గిరిజనుల అవస్థలు
గూడెంకొత్తవీధి,న్యూస్‌లైన్: అది 2013 మార్చి 17.. అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు జయరాం రమేష్, కిశోర్‌చంద్రదేవ్, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు జీకేవీధిలో పర్యటించారు. విశాఖ మన్యాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేస్తామని చెప్పారు. హామీలు గుప్పించారు.
అట్టహాసంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పీఎంజీవై పథకం ద్వారా రూ.525 కోట్లతో 965 కిలో మీటర్ల వరకూ రహదారులు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో సభా ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి జానారెడ్డి సమక్షంలో ఈ రహదారులు 2014 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదు. మాజీ మంత్రి బాలరాజు సొంత మండలంలో రూ.57 కోట్లతో 14 రహదారులు నిర్మించాల్సి ఉంది. కేవలం 4 రోడ్లకే అటవీశాఖ నుంచి అనుమతులు లభించడంతో మిగిలిన 10 రహదారులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అనుమతులు లభించిన 4 రోడ్లు నేరెళ్లబంద, జడలకొత్తూరు, రింతాడ, తీముల బంద ప్రారంభమైనప్పటికీ ఏ ఒక్క రోడ్డునూ పూర్తి చేయలేదు.
కలగానే 100 పడకల ఆస్పత్రి
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు విశాఖ మన్యం చింతపల్లిలోని ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి బాలరాజు హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.5.73 కోట్లు నిధులు మంజూరు చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఏడాది అవుతున్నా ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభించలేదు. కేవలం 5 ఎకరాల స్థలాన్ని సేకరించి చేతులు దులుపుకున్నారు.
అన్నీ ‘కోతలే’
ఏళ్ల తరబడి గిరిజనులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని మాజీ సీఎం, మాజీ మంత్రి హామీలిచ్చారు. రూ.25 కోట్లతో చింతపల్లి 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. పనులు మాత్రం ప్రారంభించలేదు. దీంతో చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో సమస్య అలాగే ఉంది. నిత్యం విద్యుత్ సరఫరాలో అంతరాయంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు.