హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి
- విభజన నిర్ణయం బాధాకరం
- సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి జైరాం రమేష్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగకపోవడంతో ఒక్క హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తం పరిమితమై పోయిందని కేంద్రమంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. దీనికి నిదర్శనమే రాజధానిలో 435 వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విభాగాలు ఏర్పడడం అన్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో ఒకే రాష్ట్రంలో అనేక నగరాలు ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
సోమవారం విశాఖలో ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక వృద్ధి అనే అంశంపై సీఐఐ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను అన్నీ దొరికే ఒక ఐలాండ్‌గా మార్చేశారన్నారు. ప్రస్తుతం విభజన నిర్ణయం చాలా బాధాకరమైన విషయంగా అభివర్ణించారు. రాష్ట్రం ముక్కలైనా పరిశ్రమల సమాఖ్యకు సంబంధించిన సీఐఐ మాత్రం ఒకటిగానే ఉండాలన్నారు. సీమాంధ్రకు కొత్త రాజధాని ఎంపిక పూర్తయితే రెండేళ్లలో హైదరాబాద్‌కన్నా వేగంగా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
ఐటీ రంగం గురించి మాట్లాడుతూ 2004కు ముందు చంద్రబాబు ఐటీని తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ తిరిగేవారని, కానీ ఆ తర్వాత ప్రభుత్వం వచ్చాక అంతకుమించి ఐటీ రంగం వృద్ధి సాధించిందని చెప్పారు. అంతకుముందు పలువురు పారిశ్రామికవేత్తలు విశాఖను ఏవిధంగా భవిష్యత్తులో అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చించారు. పోర్టులు, రవాణా వంటివి ఉన్నా నాణ్యమైన విద్యుత్ లేకపోవడంతో కొత్తపరిశ్రమల స్థాపనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు.