విలీనం లేనట్టే!
- భీమిలి, అనకాపల్లి విలీన ఫైల్ వెనక్కి?
- టీడీపీ శ్రేణుల్లోనూ విలీనంపై విముఖత
- జీవీఎంసీ ఎన్నికలకు సన్నాహాలు
సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీలో భీమిలి, అనకాపల్లి విలీన ప్రహసనానికి దాదాపు తెరపడినట్టే. దీంతో జీవీఎంసీతోపాటు, అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. జీవీఎంసీలో ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ)లో ఈ మేరకు ఫైల్ నడుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. గరిష్టంగా మూడు నుంచి ఆరు మాసాల వ్యవధిలో కార్పొరేషన్ ఎన్నికలు ముగుస్తాయని పేర్కొంటున్నారు.
ఏడాదిన్నర ప్రహసనం!
ఏడాదిన్నర కిందట నుంచి జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి విలీన ప్రహసనం నడిచింది. గత అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు దీనిపై పట్టుపట్టారు. 2012 ఫిబ్రవరిలో జీవీఎంసీ పాలక మండలి గడువు ముగిశాక ప్రత్యేకాధికారుల పాలనలో దీనికి ఆమోదం తెలిపారు. దీంతో ఏడాది కిందట విలీన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
భీమిలి-జీవీఎంసీ మధ్యనున్న ఐదు పంచాయతీలు మాత్రం విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కాయి. కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పంచాయతీలకు ఎన్నికలు కూడా నిర్వహించేశారు. తాజాగా గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా, అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. భీమిలి వాసులకు గంటా విలీనాన్ని నిలుపుదల చేయిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. శాటిలైట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ అప్పటికే పంచాయతీల విలీనం ఉపసంహరణకు గురవడంతో.. భీమిలి విలీనం కూడా వెనక్కి వెళ్తుందని తేటతెల్లమయిపోయింది.
అనకాపల్లి విలీనమూ హుళక్కే!
భీమిలి విలీనంపై వెనుకడుగు పడడంతో.. అనకాపల్లి విలీనంపైనా మబ్బులు ముసురుకున్నాయి. ఏ ఒక్కటి విలీనం చేసినా.. విలీన ప్రక్రియకు కనీసం ఆరు మాసాలు పడుతుంది. వార్డుల పునర్విభజన, జన గణన తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేయాలి.
కేవలం అనకాపల్లి కోసమే ఈ తతంగమంతా చేయడం వృథా ప్రయాసగా అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంఏయూడీకి కూడా నివేదించినట్టు తెలిసింది. ఈసారికి జీవీఎంసీతోపాటు, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలకు యథావిధిగా ఎన్నికలు నిర్వహించడమే మేలన్న భావనకు యంత్రాంగం వచ్చింది. అలాగైతే ఇప్పటికే వీటికి బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణన కూడా ముగియడంతో.. ఎన్నికల ప్రక్రియ తేలికేనని చెప్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగియడంతో.. ఈ దిశగా ఇపుడు ఎంఏయూడీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన వ్యవహారంలో బిజీగా ఉండటంతో జూన్ రెండో వారంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు.