
సాక్షి, అమరావతి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా అలాగే ఉంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారకుండా నిలకడగా కొనసాగుతోందని వాతావరణ విభాగం నిపుణులు తెలిపారు.
36 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో ఉత్తర, కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలుగు వీస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. మంగళవారం రాయలసీమ ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.
తుపానుగా మారే అవకాశం తక్కువ..
ఆంధ్రప్రదేశ్ దిశగా ‘ఎంఫాన్’ తుపాను పయనిస్తోందంటూ కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని భారత వాతావరణం విభాగం (ఐఎండీ) అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ‘వాతావరణం అనుకూలించకపోవడంవల్ల అల్పపీడనం ఇప్పటి వరకూ బలపడలేదు. వచ్చే నాలుగైదు రోజుల వరకూ అది తుపానుగా మారే అవకాశం లేదు. ఇది ఏపీకి దూరంగా ఉంది. అసలు అది వాయుగుండంగా మారే అవకాశాలు కూడా అతి తక్కువే. ఒకవేళ మారినా మన రాష్ట్రానికి పెద్దగా ప్రభావం ఉండదు. అది తుపానుగా మారే అవ కాశం ఉంటే నాలుగైదు రోజుల ముందే ఐఎండీ ప్రకటిస్తుంది. పంట లు కోతకు వచ్చి ఉంటే నూర్పిళ్లు చేసుకోవడం మంచిదేగానీ లేని దాని ని ఉన్నట్లు ప్రచారం చేయడం సరికాదు. ఐఎండీ ఏదైనా అన్నీ పరిశీలించి నిర్ధారించుకున్నాకే ప్రకటిస్తుంది’ అని ఆమె ‘సాక్షి’కి తెలిపారు.