‘అమృతహస్తం’లో లోపాలు సరిదిద్దుతాం
Published Wed, Dec 11 2013 12:45 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
పరిగి, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందజేసేందుకు ఉద్దేశించిన అమృతహస్తం పథకంలో లోపాలను సరిదిద్ది పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చిరంజీవి తెలిపారు. మంగళవారం పరిగితోపాటు మండల పరిధిలోని మిట్టకోడూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. స్థానిక అధికారులు, సిబ్బందితోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన బాలింతలు, గర్భిణులతో మాట్లాడారు. అనంతరం పరిగి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృతహస్తం పథకం అమలులో అంగన్‌వాడీలు, ఐకేపీల మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు సమావేశాలు, కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ఇక ప్రతి రోజూ పర్యవేక్షించనున్నట్టు కమిషనర్ చెప్పారు. ప్రతి సెంటర్ నుంచి రోజువారీ నివేదికలు పంపించేందుకు వీలుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు త్వరలో సిమ్ కార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.
పిల్లల్లో పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు చర్యలు
రాష్ట్రంలో ఇంకా 1.5 లక్షల మంది పిల్లలు ఉండాల్సిన బరువుకంటే తక్కువ ఉన్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపం నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలలో రెండుసార్లు ెహ ల్త్ అండ్ న్యూట్రిషన్ డేలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వారానికి నాలుగుసార్లు గుడ్లు, పౌష్టికాహారం సరుకులు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 406 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా అందులో 178 ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
కొత్తగా 3,218 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు 250 భవనాల చొప్పున మొత్తం 3,218 అంగన్‌వాడీ కొత్త భవనాలు నిర్మిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఒక్కో భవనానికి రూ.6.5లక్షల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయన్నారు. మొత్తం రాష్ట్రంలో 91,307 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలలో 1,745 గ్రేడ్ -2, 655 గ్రేడ్-1 సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీ కోసం పరీక్షలు నిర్వహించామని, అయితే కోర్టులో కేసు వల్ల ఫలితాలు వాయిదా పడ్డాయన్నారు. 106 సీడీపీఓ పోస్టుల భర్తీకి కూడా పరీక్షలు నిర్వహించామని, మరో 107 సీడీపీఓ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ రాజ్యలక్ష్మి, పీడీ శేషుకుమారి, సీడీపీఓ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement