ఉన్నవి పోతున్నాయ్‌.. కొత్తవి రాకున్నాయ్‌! | Industries are shutting down in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉన్నవి పోతున్నాయ్‌.. కొత్తవి రాకున్నాయ్‌!

Published Mon, May 22 2017 9:16 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

ఉన్నవి పోతున్నాయ్‌.. కొత్తవి రాకున్నాయ్‌!

ఉన్నవి పోతున్నాయ్‌.. కొత్తవి రాకున్నాయ్‌!

రాష్ట్రంలో మూడేళ్లలో పరిశ్రమలు మూతలే మూతలు
సాక్షి, అమరావతి: లక్షల కోట్ల పెట్టుబడులు,  లక్షల సంఖ్యలో ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కొత్త పరిశ్రమలు దేవుడికెరుక.. ఎప్పటినుంచో ఉన్న పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత మూడేళ్లలో 120కి పైగా యూనిట్లు మూతపడ్డాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 125 పరిశ్రమలు మూతపడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో రవాణా, ఆర్థిక, వ్యవసాయ రంగాలు కుదేలయ్యాయి. ఆయా జిల్లాల్లో వందల సంఖ్యలో పరిశ్రమలు మూతపడడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి భిక్షమెత్తుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి.

రవాణా రంగానికి పంక్చర్‌..
ఉమ్మడి రాష్ట్రంలో రవాణా రంగానికి విజయవాడ కేంద్రంగా భాసిల్లింది. అనేక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ విజయవాడ కేంద్రంగా వ్యాపారాన్ని చేపట్టి ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. అయితే ప్రస్తుతం అనేక సంస్థలు మూతపడుతున్నాయి. లింగమనేని గ్రూపు 2013లో విజయవాడ కేంద్రంగా ‘ఎయిర్‌కోస్టా’ పేరుతో ప్రాంతీయ విమాన సర్వీసులు ప్రారంభించి అనతికాలంలోనే ప్రాంతీయస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎదిగింది. కానీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్‌కోస్టా తమ సర్వీసులను ఆపేసింది. ఒకపక్క విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రయాణికుల వృద్ధిరేటులో మొదటిస్థానంలో ఉండగా.. మరోపక్క ఇదే కేంద్రంగా సర్వీసులు నిర్వహిస్తున్న ఎయిర్‌కోస్టా మూతపడటం గమనార్హం.

సీఎం చంద్రబాబు సింగపూర్, మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌లాగా రాష్ట్రం నుంచి ‘అమరావతి ఎయిర్‌లైన్స్‌’ నడపాలన్న కొద్దిరోజులుకే ఎయిర్‌కోస్టా మూతపడటం కాకతాళీయం. కానీ ఇదే లింగమనేని గ్రూపు రియల్‌ ఎస్టేట్, ఆతిథ్య రంగాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ప్రైవేటు ట్రావెల్స్‌లో ప్రత్యేక ఇమేజ్‌ను సృష్టించుకుని సుదీర్ఘకాలంగా ఇదే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ ఎంపీకి చెందిన కేశినేని ట్రావెల్స్‌ మూసేయడం పెద్ద సంచలనంగా మారింది. దీని కంటే ముందే కాళేశ్వరి ట్రావెల్స్‌ కూడా సర్వీసులను ఆపేసింది. దీంతో వేలాది మంది డ్రైవర్లు, క్లీనర్లు, టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్లు ఉపాధి కోల్పోయారు.

బోర్డు తిప్పేస్తున్న ఆర్థిక సంస్థలు
ఆర్థిక మోసాల సంగతైతే చెప్పక్కర్లేదు. అధికార పార్టీ అండదండలతో ఫైనాన్స్‌ సంస్థలు ప్రజలు దాచుకున్న వేలాది కోట్ల రూపాయలకు శఠగోపం పెట్టేశాయి. మూడేళ్లలో పదికిపైగా ఫైనాన్స్‌ సంస్థలు రూ.12,109 కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్నాయి. అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అవనిగోల్డ్, గోల్డ్‌క్వెస్ట్, అక్షయగోల్డ్, బొమ్మరిల్లు, శ్రీ పూజిత, సిరిగోల్డ్, సిమ్స్, వీర్‌ చిట్స్‌ సంస్థలు బోర్డులు తిప్పేయడంతో ఇన్వెస్టర్లు ఆర్థికంగా నష్టపోవడమేగాక వాటిల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. ఇక కేశవరెడ్డి పాఠశాలలు అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.700 కోట్లు అక్రమంగా సేకరించి బోర్డు తిప్పేయడం విదితమే. ఈ ఆర్థిక సంస్థల మోసాల కేసుల్లో అధికార పార్టీ నేతల హస్తమున్నట్లు పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి.

సంక్షోభంలో వ్యవసాయం..
రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా జూట్, స్పిన్నింగ్, రైస్‌మిల్లుల పరిస్థితి దారుణంగా ఉంది. పెరిగిన ముడిసరుకుల ధరలు, విద్యుత్‌ చార్జీల బాదుడుతో యూనిట్లు మూతపడుతున్నాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 14 జూట్‌ మిల్లులుండగా తొమ్మిది మూతపడ్డాయి. అలాగే గుంటూరు జిల్లాలోని భజరంగ్‌ జూట్‌ మిల్లూ మూతపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు పెరిగి, దానికి తగ్గట్టుగా యార్న్‌ ధరలు పెరగకపోవడంతో స్పిన్నింగ్‌ మిల్లులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, పెరిగిన విద్యుత్‌ చార్జీలు అగ్రి అనుబంధ పరిశ్రమలు మూతపడటానికి కారణమని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. దీంతో ఈ మూడు రంగాల్లోనే 50,000 మందికిపైగా ఉపాధి కోల్పోయారు.

ముఖం చాటేస్తున్న పీఎస్‌యూలు
గతంలో భారీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలతో ముందుకొచ్చిన ప్రభుత్వరంగ సంస్థలు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నం–కాకినాడ మధ్య ఏర్పాటు చేయదల్చిన పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (పీసీపీఐఆర్‌) ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించింది. రూ.3.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణతో, 12 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించనందున ఆపేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా మన్నవరంలో రూ.6,000 కోట్ల పెట్టుబడితో బీహెచ్‌ఈఎల్‌–ఎన్‌టీపీసీ యూనిట్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో శంకుస్థాపన చేయించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును రూ.361 కోట్లకు పరిమితం చేసి మిగిలిన విస్తరణను వేరే రాష్ట్రానికి తరలించినా మిన్నకుండిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న వైజాగ్‌స్టీల్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఇప్పుడు ఆర్థికంగా కష్టాల్ని ఎదుర్కొంటోంది. దీంతో గతంలో చేద్దామనుకున్న రూ.22,000 కోట్ల భారీ విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నష్టాల్లో ఉందన్న సాకుతో ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement