అందింది సగం మందికే
సరుకులూ నాసిరకమే
గోధుమ పిండి, నెయ్యి మరీ అధ్వానం
తూకంలోనూ చేతివాటం
రంజాన్ తోఫాపై పెదవి విరుస్తున్న ముస్లింలు
రంజాన్ తోఫా పేరిట పేద ముస్లింలకు రాష్ట ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఇచ్చిన సరుకులు నాసిరకంగా ఉండగా.. వాటిని కూడా సగం మందికే సరఫరా చేసి చేతులు దులుపుకుంటోంది. గోధుమ పిండి, నెయ్యి మరీ అధ్వానంగా ఉన్నాయని ముస్లింలు వాపోతున్నారు. తూకంలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.
మదనపల్లె సిటీ : రంజాన్ తోఫా పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సరుకులు మరీ అధ్వానంగా ఉంటున్నాయి. గోధుమ పిండి, నెయ్యి నాసిరకంగా ఉన్నాయని ముస్లింలు చెబుతున్నారు. గోధు మ పిండి ప్యాకెట్ విప్పగానే ఓ రకమైన దుర్వాసనతో పాటు అధిక భాగం పొట్టు కలిపి ఉందని, నెయ్యి ఏ మాత్రం నాణ్యత లేదని, తూకంలోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని వారు వాపోతున్నారు. జిల్లాలో 2,832 రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్‌కార్డులు ఉన్న 1,15,137 పేద ముస్లింల కుటుంబాలకు చంద్రన్న తోఫా పేరిట నాలుగు నిత్యావసర సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జులై 1 నుంచి వీటిని అందించాల్సి ఉంది. కానీ ఆదివారం నాటికి జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు అందలేదు.
ఎంత అందించాలంటే ఒక్కో కుటుంబానికి రంజాన్ తోఫా పేరిట ఐదు కేజీల గోధుమ పిండి, రెండు కేజీల పంచదార, 100 గ్రాముల నెయ్యి అందించాలి. కొందరికే సరుకులు జిల్లాలోని కొన్ని మండలాల్లో అర్హులైన పేర్లు ఆన్‌లైన్‌లో రాకపోవడంతో వారికి సరుకులు పొందే అవకాశం లేకుండా పోయింది. మదనపల్లె పట్టణం సైదాపేట, అప్పారావుతోట, అనంతయ్యబంగ్లా వీధుల్లో సగానికిపైగా సరుకులు అందలేదు. దీనికి కారణం ఈపాస్‌లో చోటుచేసుకున్న సాంకేతిక తప్పిదాలే. వారికి నాట్ ఫర్ తోఫా అని ఈపాస్‌లో చూపిస్తోంది. ఇదే పరిస్థితి జిల్లాలోని పలు మండలాల్లోనూ ఎదురైనట్టు సమాచారం.
నెయ్యిలో చేతివాటం
నెయ్యి ప్యాకెట్ల తయారీలో చేతివాటాన్ని ప్రదర్శించారు. నాణ్యత విషయం పక్కనపెడితే తూకంలోనూ మోసం చేశారు. 100 గ్రాములు ఉండాల్సిన నెయ్యి 75 నుంచి 85 గ్రాములు ఉంది. గోధుమ పిండిలో ఎక్కువ మోతాదు తవుడు ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఉపయోగించలేని విధంగా రంగు మారి ఉంది. దీంతో చాలా మంది దీన్ని వినియోగించడం లేదు. చక్కెరలోనూ అంతే. నాణ్యమైన సన్న చక్కెరకు బదులు లావు చక్కెరను సరఫరా చేశారు. ఇక సేమియాల పరిస్థితి మరీ అధ్వానం.
మూడు రోజుల నుంచి తిరుగుతున్నా
రంజాన్ తోఫా కోసం మూడు రోజుల నుంచి షాపు వద్దకు తిరుగుతున్నా. ఈపాస్‌లో నాట్ ఫర్ తోఫా అని చూపిస్తోంది. షాపు డీలర్ తోఫా ఇవ్వలేదు. ఇదేమని అడిగితే మీకు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారు. చాలా మందికి ఇలా అన్యాయం చేశారు.
-ఆర్‌ఎం.మస్తాన్, అప్పారావుతోట, మదనపల్లె
పేదోళ్లు కనబడలేదా?
నేను బండిపై పూలు అమ్మి బతుకుతున్నా. రేషన్‌కార్డు కోసం పలు సార్లు అర్జీలు ఇచ్చాను. ఇప్పటి వరకు రాలేదు. ఆ సాకుతోనే నాకు రంజాన్ తోఫా ఇవ్వలేదు. కనీసం పండుగ సమయంలోనైనా పేదలు గుర్తుకు రాలేదా.
-జి.హుస్సేన్, ఈశ్వరమ్మకాలనీ, మదనపల్లె రూరల్
నెయ్యి బాగాలేదు
రంజాన్ తోఫాలో భాగంగా ఇస్తున్న నెయ్యి మరీ నాసిరకంగా ఉంటోంది. 100 గ్రాములకు కేవలం 75 గ్రాముల నెయ్యిని అందించారు. మిగిలిన సరుకులు కూడా అంతమాత్రమే. అర్హులైన అందరికీ నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి.
-షేక్ మస్తాన్, మదనపల్లె
ఇదేం తోఫా?
Published Mon, Jul 4 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement
Advertisement