చెక్‌బౌన్స్‌ అయితే.. తక్షణ పరిహారం | Instant compensation for Check Bounce | Sakshi
Sakshi News home page

చెక్‌బౌన్స్‌ అయితే.. తక్షణ పరిహారం

Published Tue, Jul 31 2018 2:36 AM | Last Updated on Tue, Jul 31 2018 8:08 AM

Instant compensation for Check Bounce - Sakshi

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు పెరుగుతున్నా బ్యాంకు చెక్కులకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గడం లేదు. న్యాయస్థానాల్లో పెరిగిపోతున్న చెక్‌ బౌన్స్‌ కేసులే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 45 లక్షలకు పైగా చెక్‌ బౌన్స్‌ కేసులున్నాయని అంచనా. ఒక చెక్‌ బౌన్స్‌ కేసు పరిష్కారం కావడానికి సగటున నాలుగేళ్లు పడుతోందని ఒక సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

కేసుల సంఖ్య పెరిగి పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుండటం బాధితుడికి సరైన ప్రయోజనం లభించడం లేదు. దీంతో నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ యాక్ట్‌ 1881కి కీలక సవరణలు చేశారు. ఈ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలపడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. దీనివల్ల చెక్‌ బౌన్స్‌ కేసుల విచారణ వేగంగా పరిష్కారమై విలువైన సమయంతో పాటు కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా..
ఆర్థిక లావాదేవీల్లో హామీగా చెక్కులివ్వడం పరిపాటి. ఒక వ్యక్తి నుంచి నగదు తీసుకున్నా, లేక సరుకు తీసుకున్నా ఆ మొత్తానికి హామీగా పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు తీసుకుంటారు. కానీ లావాదేవీల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతుంటాయి. ఇలా బౌన్స్‌ అయిన వాటిపై కోర్టులకు వెళుతుంటారు. కానీ ఇక నుంచి చెక్‌బౌన్స్‌ అయితే ముందుగా చెక్‌ ఇచ్చిన మొత్తంలో 20 శాతం కట్టడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి.

చెక్కు తీసుకున్న వారి హక్కులు పరిరక్షించేలా నెగోషిబుల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ యాక్ట్‌లో సెక్షన్‌ 143ఏ వచ్చి చేరింది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌ 138 ప్రకారం చెక్‌బౌన్స్‌ కేసులను క్రిమినల్‌ నేరంగా భావించి గరిష్టంగా రెండేళ్ల వరకు జైళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ కేసు తేలే వరకూ బాధితుడికి ఒక్క పైసా కూడా రావడం లేదు. కింది కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చినా.. పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. దీనివల్ల చెక్‌ తీసుకున్న వాళ్లు సరుకులు, డబ్బులు ఇచ్చి అవి తిరిగిరాక ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిని అరికట్టడానికి చట్టంలో మూడు కీలక మార్పులు చేశారు.

1. మధ్యంతర పరిహారం
చెక్‌ బౌన్స్‌ అయ్యిందంటూ కోర్టుకు వెళితే తక్షణమే మధ్యంతర పరిహారం ఇచ్చే హక్కులను సెక్షన్‌ 143ఏ కల్పిస్తోంది. దీని ప్రకారం చెక్‌ ఇచ్చిన మొత్తంలో 20 శాతం వరకు బాధితుడికి చెల్లించేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేయవచ్చు. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కేసు పూర్తయ్యేలోగా కనీసం కొంత మొత్తమైనా బాధితుడికి లభించనుంది. ఇప్పటి వరకు కేసు పూర్తి విచారణ అయ్యి తుది తీర్పు వచ్చే వరకూ ఎటువంటి చెల్లింపులు చేయడానికి అవకావం ఉండేది కాదు.

2. అప్పీల్‌కి వెళితే డిపాజిట్‌ చేయాలి
ఒక వేళ కింది కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని చెక్‌ ఇచ్చిన వ్యక్తి భావించి పై కోర్టులో సవాల్‌ చేయాలంటే.. కింది కోర్టు తీర్పు ఇచ్చిన నష్టపరిహారంలో 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సి ఉంటుంది.

3. ఓడిపోతే వడ్డీతో సహా చెల్లించాలి
ఒకవేళ చెక్‌ బౌన్స్‌ అయ్యిందంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి సహేతుక కారణాలు చూపించలేకపోతే.. డిపాజిట్‌ చేసిన మొత్తంపై వడ్డీతో సహా చెక్‌ ఇచ్చిన వారికి చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement