రాజాం నగర పంచాయతీ కార్యాలయం
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): రాజాం నగర పంచాయతీ అక్రమాలకు అడ్డాగా మారింది. 2005లో ఏర్పడిన ఈ నగర పంచాయతీకి ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోయినా..పట్టణంలో నివాసం ఉంటున్న ప్రజలకు మాత్రం ఇంటి పన్ను, కొళాయి పన్నుల రూపంలో అదనపు భారం పెరుగుతోంది. ఇవి చాలవు అన్నట్టు అక్రమ వసూళ్లతో నగర పంచాయతీ అధికారులు ప్రజలను పీక్కుతింటున్నారు.
పని ఏదైనా పైకం చెల్లించాలి
గత ఐదేళ్లుగా రాజాం నగర పంచాయతీలో అధికారుల అక్రమాలు అధికమయ్యాయి. చేయి తడపనిదే ఏ పని జరగని పరిస్థితి దాపురించింది. ఇంటి ప్లానింగ్ అప్రువల్, బీపీఎస్, టాక్స్ చెల్లింపు, బిల్డిండ్ ప్లానింగ్ వంటి పనులకు వసూళ్ల పర్వం అధికమైంది. వాస్తవంగా ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే ఇక్కడి అధికారులకు అధికంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజాం నగరంలో వ్యాపారాలు నిలిచిపోవడానికి, ఫ్యాక్టరీలు మూతపడడానికి ఇదొక కారణమని అంటున్నారు.
బాధితుని ఫిర్యాదుతో ఏసీబీ దాడులు
ఇటీవల వారం రోజుల క్రితం రాజాం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏసీబీ దాడులు జరిగిన విషయం పాఠకులుకు విధితమే. ఆ రోజు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుని వద్ద అతని వద్దనున్న ఇంటి స్థలం కంటే ఎక్కువ మొత్తాన్ని నగర పంచాయతీ అధికారులు డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇలా ఆయన ఒక్కరే కాదు ఇంటి ట్యాక్స్‌లు, కొత్తగా స్థలాలు కొనుగోలు చేసినవారు, ప్లాట్లు నిర్మించుకుందామని అనుకున్నవారు నగర పంచాయతీ అధికారులకు లక్షల్లో ముట్టజెప్పాల్సిందే. ఇక్కడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దగ్గర నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగి వరకూ అందరూ ఎంత ఇవ్వగలవు అని అనేవాళ్లే.
ఒక్కొక్కరిదీ ఒక్కో రేటు
రాజాం నగర పంచాయతీలో ప్రతీ అధికారి తమకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని ఉంటారు. ట్యాక్స్ చెల్లించాలన్నా, కొత్త భవంతి నిర్మించాలన్నా ముందుగా నగర పంచాయతీ కార్యాలయంలోని మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని కలవాల్సి ఉంటుంది. అక్కడ ఆయన తన రేటు చెప్పిన తరువాత బిల్లు కలెక్టర్ స్థాయి వ్యక్తిని కలవమని చెబుతారు. బిల్లు కలెక్టర్ వాస్తవ రేటును చెబుతారు. వాస్తవంగా రూ.600లు చెల్లించాల్సి ఉంటే అధికారులు ఖర్చులు నిమిత్తం రూ.2000లు అదనంగా కలిపి మొత్తం రూ.2600లు డిమాండ్ చేస్తారు. ఇవి చెల్లిస్తేనే బిల్లు కలెక్టర్ మెజర్‌మెంట్లు వేస్తారు. లేకుంటే ఫైలు అక్కడే ఉండిపోతుంది. అక్కడి నుంచి ఆర్‌ఐ స్థాయి అధికారి వద్దకు ఫైల్ వెళ్తుంది. అక్కడ ఆయన ఎంత చలానా తీయాలో నిర్ణయించి రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే ఆయనకు రూ.500లు విలువ చేసే పనికి రూ.2 వేలు అదనంగా చెల్లించాలి.
ఈ మొత్తం మొదట్లో బిల్లు కలెక్టర్‌కు చెల్లించిన మొత్తంతో సంబంధం ఉండదు. ఇక్కడ చెల్లింపు తరువాత ఈ ఫైల్ మేనేజర్ స్థాయి అధికారుల వద్దకు వెళ్తుంది. ఆయన మరోసారి ఇళ్లు, స్థలం చూడాలని కొర్రీలు వేస్తారు. ఈ సమయంలో ఆయన తరుపున అక్కడ ఉన్న దళారులు రంగ ప్రవేశం చేస్తారు. ఎంత చిన్న సంతకానికైనా కనీసం రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీరి ముగ్గురు సంతకాలు తరువాతే ఫైల్ నగర పంచాయతీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి వద్దకు చేరుకుంటుంది. అక్కడ వేరే వేరే ధరలు ఉంటాయి. ప్రధానంగా వీరి ముగ్గురి అప్రూవల్ లేకుంటే అవతలి వ్యక్తి ఎంతటి వాడైనా ఆ ఫైల్ నిలిచిపోతుంది. ఇదే తరహాలో ఇటీవల అనేక ఫైళ్లు నిలిచిపోయాయి.
ఇందులో కొంతమంది బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కగా, మిగిలిన వారు తప్పించుకున్నారు. ఈ తంతు జరిగి వారం రోజులు గడవకముందే నగర పంచాయతీలోని అధికారులు మళ్లీ తమ వసూళ్లను ప్రారంభించేశారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమాలు అడ్డుకోవాలని పలువురు పట్టణ వాసులు కోరుతున్నారు. ఇంతవరకూ నగర పంచాయతీగా కార్యరూపం దాల్చని నగర పంచాయతీ కార్యాలయంలో ఈ అక్రమ దందాలు చేయడం తగునా అని వాపోతున్నారు. ఈ వసూళ్లపై నగర పంచాయతీ ఏఈ సురేష్ వద్ద సాక్షి ప్రస్తావించగా కార్యాలయంలో ఒకరిద్దరి అధికారుల వలన ఇబ్బందులు వస్తున్నాయని, ఎవరూ అదనంగా నగదు చెల్లించరాదని, ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment