
శివారు రైతుపై సాగునీటి భారం
సాగునీటి కొరత, మరోవైపు సాగు ఆలస్యంతో డెల్టాలో రబీ సేద్యం ‘భారం’గా సాగుతోంది.
కాలువల్లో అడుగంటిన నీరు
డీజిల్, విద్యుత్ మోటార్లే శరణ్యం
డెల్టా రైతులపై రూ.22 కోట్ల అదనపు వ్యయం
అమలాపురం :
ఒకవైపు సాగునీటి కొరత, మరోవైపు సాగు ఆలస్యంతో డెల్టాలో రబీ సేద్యం ‘భారం’గా సాగుతోంది. పంట కాలువల అధ్వానస్థితి, అస్తవ్యస్తమైన నీటి పంపిణీ, నీటి చౌర్యం.. వంటి కారణాలతో ఆయకట్టు శివార్లకు నీరందడం లేదు. దీంతో డీజిల్ ఇంజన్లతో పొలాల్లోకి నీరు మళ్లించాల్సి వచ్చి, పెట్టుబడి భారంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. తూర్పు, మధ్యడెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)లలో 3.30 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోంది.
ఖరీఫ్ కన్నా రబీలో ఎరువులు, పురుగుమందులకు అదనంగా ఖర్చు పెట్టడంతో పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దానికి నీటి ఎద్దడి తోడవుతోంది. రెండు డెల్టాలు, పీబీసీలో సుమారు 75 వేల ఎకరాలు మెరక చేలు. కాలువలు నిండుగా ఉన్నప్పుడే నీరు పెట్టడం కష్టం. అలాంటిది కాలువల్లో నీరు లేకపోవడంతో విద్యుత్ మోటార్లతో, డీజిల్ ఇంజన్లతో నీరు మళ్లించాల్సి వస్తోంది. దీంతో ఎకరాకు అదనంగా రూ.మూడు వేల వరకు ఖర్చవుతోంది.