ఎడమగట్టు కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
పొదలకూరు: కండలేరు ఎడమగట్టు కాలువకు లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం) మంజూరైనట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం ప్రభుత్వం రూ.61 కోట్లను మంజూరు చేస్తూ జీఓను జారీ చేసినట్టు వెల్లడించారు. ఎంతోకాలంగా మెట్టప్రాంత రైతాంగం ఎదురుచూస్తున్న కల సాకారం అయినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్న కాలం నుంచి ఎడమగట్టు కాలువకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. అప్పట్లో ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశానన్నారు. రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడే ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడాన్ని ఆయన స్వాగతించారు.
మెట్టరైతులకు తీపికబురు
కండలేరు ఎడమగట్టు కాలువ జలాశయం నుంచి సక్రమంగా నీరు అందక ప్రతి ఏటా ఇబ్బందులు పడే పొదలకూరు మండల మెట్ట రైతాంగానికి ఎత్తిపోతల పథకం మంజూరు కావడం తీపి కబురులాంటిది. చాలీచాలని సాగునీటితో వంతులవారీగా రైతాం గం కాలువ గుండా సాగునీటిని పారించుకునే వారు. ఎత్తిపోతల పథకం పూర్తిఅయితే జలాశయంలోని నీటిని ఎల్లవేళలా పారించుకునేందుకు వీలుకలుగుతుంది. ఎత్తిపోతల పథకం కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సుదీర్ఘకాలం పోరాటమే చేశారు. రైతుల పక్షాన నిలబడి ఆయన కాలువకు ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతను ఆయా ప్రభుత్వాలకు వివరించారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి పథకానికి నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీచేసింది.