చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్‌ జగన్‌ | Is it correct to chandrababu naidu speech, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్‌ జగన్‌

Published Wed, Mar 22 2017 2:02 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్‌ జగన్‌ - Sakshi

చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారని ఆయన మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. 80 శాతం ప్రాజెక్టుల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని, మిగతా 20శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు. గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడు సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. మూడేళ్లయినా చంద్రబాబుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేదన్నారు.

శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమకు నీళ్లివ్వలేదని, అలాంటి మనిషి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికే పూర్తయిందని, ఇప్పటివరకూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు. జల దినోత్సవం అంటూ సభలో చంద్రబాబు అరగంటసేపు ప్రకటన చేశారని, ఆ ప్రకటన రెచ్చగొట్టేలా ఉందని, కావాలనే పాత అంశాలను ప్రస్తావనకు తెచ్చారన్నారు. ఆ ప్రకటన ఆత్మస్తుతి, పరనిందలా ఉందని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, ప్రకటన సమయంలో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు అవకాశం లేదని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అడిగితే సమయం ఇవ్వరా? మరి చంద్రబాబు చేసింది సరైనదేనా?అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక తాము సభలోకి వెళ్లామని, అప్పుడు కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రతిజ్ఞ చేయనివారు నీటిని సంరక్షించరా? అని అన్నారు.

ఇక అనంతపురం పట్టభద్రుల స్థానం సహా నాలుగుచోట్ల తాము గెలిచామని, చదువుకున్న వారంతా తమకే ఓటు వేశారన్నారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఫలితాలు అని వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు పాల్పడ్డారని, కోట్లు వెచ్చించి ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. చంద్రబాబువి భారతంలో ఉత్తర కుమారుడి ప్రగల్భాలే అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement