హైటెక్‌... దొంగలు | IT Grid Scam Nara Lokesh Hand in Data Stolen Case | Sakshi
Sakshi News home page

హైటెక్‌... దొంగలు

Published Tue, Mar 5 2019 8:03 AM | Last Updated on Tue, Mar 5 2019 8:29 AM

IT Grid Scam Nara Lokesh Hand in Data Stolen Case - Sakshi

సర్వే బృంద యువకుల వద్ద ఉన్న టీడీపీ గుర్తింపు కార్డు (ఫైల్‌), స్పా సంస్థ పేరుతో ఉన్న గుర్తింపు కార్డు

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ: గత ఏడాది గుర్తుతెలియని కొందరు వ్యక్తులు రాజోలు మండలం తాటిపాక గ్రామంలో టీడీపీ గుర్తింపు కార్డులతో, మంత్రి నారా లోకేష్‌ ఫోటో ఉన్న ఐడెంటిటీ కార్డుతో సంచరిస్తూ, ల్యాప్‌టాప్‌ల్లో ఓటర్ల వివరాలను నమోదు చేసినప్పుడే అనుమానం వచ్చింది. టీడీపీ కిరాయి మనుషులు వచ్చి జిల్లాలో ఏదో మతలబు చేస్తున్నారని, తమ వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని. సదరు అనుమానిత వ్యక్తులను వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే చర్యలు తీసుకోకుండా అప్పగించిన వారిపై కేసులు పెడతామని బెదిరించినప్పుడే దీనివెనక కుట్ర ఏదో దాగి ఉందని సందేహం వ్యక్తమయింది. ఊహించినట్టే నాటి నిర్వాకం నేడు బయటపడుతోంది. ఓట్లు తొలగించేందుకు పచ్చనేతలు వ్యూహాత్మకంగా చేసిన పన్నాగమని తేలింది. (డేటా చోర్‌.. బాబు సర్కార్‌)

హైదరాబాద్‌లో ఉన్న ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్‌ సంస్థలతో కలిసి పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించేందుకు పక్కా ప్రణాళిక రచించారని తాజాగా బయటపడింది. నాడు గ్రామాల్లో తిరిగి ఓటర్ల వివరాలను సేకరించిన వారంతా వీరి మనుషులేనని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు రట్టు చేసిన గుట్టుతో తమ్ముళ్ల బండారం బయటపడింది. సదరు పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారంగా చూస్తే  కేవలం ఓట్లే కాదు మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆ సంస్థలకు ఇచ్చి, తద్వారా బ్లాక్‌ మెయిల్‌ చేసో...తమకున్న సమాచారం ద్వారా నష్టం కలిగించో...నయానో...భయానో తమ దారికి తెచ్చుకొని ఏదోవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది వారి ఎత్తుగడగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. (డేటా స్కామ్‌ డొంక కదులుతోంది!)

చింతూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ ఎగుమతి రామలింగారెడ్డి తన కుమారులైన ఎగుమతి నిర్మలకుమార్‌ రెడ్డి, ఎగుమతి శివానందరెడ్డిల పేర్లు  తొలగించాలని అభ్యర్థనలు పెట్టినట్టుగా ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. కొడుకుల ఓట్లు తీసేయాలని ఏ తండ్రైనా దరఖాస్తు చేస్తారా? వారి ఓట్లు వారే తొలగించుకుంటారా? కానీ చంద్రబాబు ప్రభుత్వం అదే నిజమని నమ్మిస్తోంది. తమ కొడుకుల పేర్లను తానెలా తొలగించాలని ఫిర్యాదు చేస్తానని, తన పేరున ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసిందెవరో తేల్చాలని ఫిర్యాదు చేస్తే దాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారు.

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాబాయ్‌ అయిన వైఎస్‌ వివేకానంద రెడ్డి ఓటును తానే తొలగించమని ఆన్‌లైన్‌లో అభ్యర్థన చేసినట్టుగా కనిపిస్తోంది. ఎవరైనా తన ఓటును తానే తొలగించాలని కోరుతారా? ఇది ప్రత్యర్థులు చేసిన పని కాకపోతే ఏమనాలి. ఇదంతా తమ్ముళ్లు చేసిన కుట్రైతే అది కూడా వైఎస్సార్‌సీపీకే అంటగడుతున్న మహా తెలివి దేశంలో టీడీపీ అధినేతకు తప్ప ఏ ఒక్కరికీ ఉండదు.

ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఉదాహరణలు. ఇదేదో పొరపాటు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వ్యూహాత్మకంగా జరిగాయన్నది హైదరాబాద్‌లో బయటపడ్డ ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్‌ సంస్థల బాగోతంతో స్పష్టమవుతోంది. మన వ్యక్తిగత సమాచారాన్ని మంత్రి లోకేష్‌ కనుసన్నల్లో ప్రైవేటు కంపెనీకి లీక్‌ చేశారని, ఏపీ ప్రభుత్వ సర్వర్‌ నుంచి డేటా చోరీ చేశారని, ఆ రెండు సంస్థలు రాష్ట్రంలో ప్రజల జీవితాలకు భద్రత లేకుండా చేశాయని తేలింది. మన సమాచారమంతా ప్రైవేటు వ్యక్తుల చేతికిచ్చేశారు. ఎవరి పరిస్థితేమిటి? ఎవరి వద్ద ఏముంది? వారు ఏ పార్టీ వారు? ఓటర్ల బంధువులతో పాటు వారి ఫోన్‌ నెంబర్ల వివరాలు? ఎవరెవరు ఏ పథకం నుంచి లబ్ధి పొందారు? లేదా పొందుతున్నారు...?తదితర డేటా అంతా ఆ రెండు సంస్థలు ప్రభుత్వం నుంచి సేకరించాయి. వాటిన్నింటినీ టీడీపీ సేవామిత్ర యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు.

ఇలా డేటా చోరీ చేసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎత్తుగడ వేశారు. ఏపీ ఓటర్ల వివరాలు టీడీపీ యాప్‌లోకి ఎలా వచ్చాయి? ఏపీ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం బయట వ్యక్తుల చేతికి ఎలా వచ్చింది? ప్రజల వ్యక్తిగత వివరాలను బయట వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అడిగితే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఎదురుదాడికి దిగుతున్నారు. ఫిర్యాదు చేసిన వారిపైనా, విచారణ జరుపుతున్న వారిపై బెదిరింపు ధోరణితో మాట్లాడటమే కాకుండా దీనివెనక తన ప్రత్యర్థి పార్టీల కుట్ర ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ గ్రిడ్, బ్లూఫ్రాగ్‌కు వెళ్లిన సమాచారం చూస్తే భవిష్యత్తులో మన ఓటు ఉంటుందో ఉండదో? మన వ్యక్తిగత విషయాలకు ఏరకమైన భంగం కఉగుతుందో? ఏ రూపంలో నష్టం వాటిల్లుతుందో? తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. (‘ఐటీ గ్రిడ్స్‌’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం)

ఆగని నకిలీ అభ్యర్థనలు...
వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల ప్రమేయాలు లేకుండా ఓట్ల తొలగింపునకు ఆన్‌లైన్‌లో నకిలీ అభ్యర్థనలు జిల్లా నుంచి వెళ్తున్నాయి. గత వారం రోజులుగా ప్రతిచోటా ఈ వ్యవహారం బయటపడుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల ఓట్లు తొలగించేందుకు అజ్ఞాత వ్యక్తుల ముసుగులో తమ్ముళ్లు యత్నించారు. మీసేవ, ఇంటర్నెట్‌ కేంద్రాలను ఆధారంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల పేరుతో వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదులతో అప్రమత్తమైన అధికారులు మీసేవా కేంద్రాలు, పలువురు వ్యక్తులపై పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ మొత్తం బాగోతం వెనక ఐటీ గ్రిడ్, బ్లూఫాగ్‌ వంటి సంస్థలు ఉన్నాయన్నది తెలియగానే ఎప్పుడు ఎవరి ఓటు పోతుందోనన్న ఉత్కంఠ రేకెత్తుతోంది. ఒక్క ఓటే కాకుండా ఇంకేరకమైన హానికి తలపడుతున్నారోనని ప్రజలకు భయం పట్టుకుంది. విశేషమేమిటంటే ఏ సంస్థలకైతే మన డేటా ఇచ్చారో వారికే ప్రభుత్వంలోని పలు కీలక బాధ్యతలను ఔట్‌ సోర్సింగ్‌ రూపంలో కట్టబెట్టడంతో జిల్లా భవిత ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. (చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో...క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement