సకలం బంద్ | jac gives bandh call for all sectors | Sakshi
Sakshi News home page

సకలం బంద్

Published Tue, Aug 13 2013 7:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

jac gives bandh call for all sectors


 సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఎన్జీఓల సమ్మె సకల జనుల సమ్మెగా మారింది. 13 రోజులుగా జరుగుతున్న ఉద్యమం నిరవధిక సమ్మెగా రూపాంతరం చెందింది. సోమవారం అర్ధరాత్రి నుంచే విద్యార్థి, ఉద్యోగసంఘాలతో పాటు మొత్తం 71 శాఖలకు సంబంధించిన 70 వేల మందికి పైగా ఉద్యోగులు సకలజనుల సమ్మె చేపట్టారు. బంద్ ప్రభావం సోమవారం నాడే కనిపించింది. సమ్మె ప్రభావం చాలా రోజులు ఉండవచ్చనే ప్రచారంతో వ్యాపారులు నిత్యావసరాల ధరలను నింగినంటించారు. నిన్న మొన్నటివరకూ రూ.30 ఉన్న టమోట రూ. 80 నుంచి వంద వరకూ పలికింది. రూ. 40 ఉన్న మిర్చి కేజీ 90 నుంచి రూ.100 వరకు అమ్మగా కిలో రూ.40 ఉన్న క్యారెట్ రూ.70కి చేరింది. ఇక బెండ, దొండ రూ. 60 నుంచి రూ.70 వరకూ పలికాయి.
 
  మంగళవారం నుంచి కూరగాయలు దొరకవంటూ వ్యాపారులు సొమ్ము చేసు కున్నారు. బంద్ ప్రభావంతో కూరగాయలు దొరకవన్న భయంతో అడిగినంత ఇచ్చి వినియోగదారులు కొనాల్సి వచ్చింది. సామాన్యులు ఈ ధరలు పెట్టి కూరగాయలు కొన లేక విలవిలలాడారు. మరోవైపు జేఏసీల పిలుపుమేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పెట్రోలు బంక్‌లను 24 గంటల పాటు మూసి వేస్తుండటంతో పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే పెట్రోల్ లేదంటూ బంకుల యజమానులు నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. ఆర్టీసీలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు బంద్‌లో పాల్గొంటుండటంతో బస్సులు నిలిచిపోనున్నాయి. వీఆర్వో మొదలుకుని తహశీల్దార్ వరకూ అందరూ సమ్మె బాట పట్టనుండటంతో రెవెన్యూ కార్యాలయాలు దాదాపు మూతపడనున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచే కలెక్టరేట్ బోసిపోయింది.  
 
 కిక్కిరిసిన ఏసీ మార్కెట్
 నెల్లూరు(పొగతోట): సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కూరగాయల వ్యాపారులు మంగళవారం బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం నెల్లూరులోని ఏసీ మార్కెట్ వినియోగదారులతో కిటకిటలాడింది. సకలజనుల సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ధరలు పెరిగిపోతాయనే ఆందోళనతో నెల్లూరు నగర వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు మార్కెట్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో కూరగాయల ధరలు చుక్కలనంటాయి.  
 మళ్లీ పెరిగిన ఉల్లి
 గూడూరు: ఉల్లి ధర అమాంతంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే రూ.60 నుంచి రూ.80కి చేరింది. ఉద్యమం పేరు తో ఉల్లిని నల్లబజారుకు తరలించడంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రచారం జరుగుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement