జగన్ రాకతో పులకించిన పల్లెలు
వైఎస్ జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డ అభిమానుల దారి పొడవునా సందడి చేసినకార్యకర్తలు
నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్
తుళ్ళూరు : రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాకతో పల్లెలు పులకించాయి. ఉద్దండ్రాయునిపాలెం దళితవాడలో కాబోయే నూతన వధూవరులు నాగేంద్రబాబు, ఝాన్సీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత వైఎస్సార్ యూత్ అధ్యక్షుడు నందిగం సురేష్ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి పూలతో దారిపొడవునా స్వాగతం పలికారు. జగన్ రాయపూడి దళితవాడ వద్ద ఆగి మహిళలు, యువకులతో కరచాలనం చేశారు. అనంతరం తుళ్ళూరు అంబేడ్కర్ బొమ్మ వద్ద మహిళలను పలకరించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
వడ్డమానులో జగన్‌కు ఘనస్వాగతం లభించింది. ఊరంతా పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. గ్రామంలో కాబోయే వధూవరులు చంద్రశేఖర్ రెడ్డి, అనూరాధలను జగన్ దీవించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి అయోధ్య రామిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి హెనీ క్రిస్టీనా, నాయకుడు కత్తెర సురేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల కిషోర్ పాల్గొన్నారు.