వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి ఫిర్యాదు
కేసు నమోదు చేసిన పోలీసులు
విజయవాడ (వన్‌టౌన్) : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన అనుచరులతో కలిసి సాక్షి మీడియా ప్రతినిధులపై, వైఎస్సార్ సీపీ నేతలపై సాగించిన దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. అధికార దాహంతో పార్టీ మారిన జలీల్‌ఖాన్‌కు వైఎస్సార్ సీపీ జారీ చేసిన విప్‌ను అందించటానికి వెళ్లిన క్రమంలో పార్టీ శ్రేణులపై ఆదివారం తన కార్యాలయంలో దాడి చేసి గాయపరిచారు. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపైనా విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. గాయపడిన పార్టీ విద్యార్థి విభాగ నగర అధ్యక్షుడు అంజిరెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విప్ పత్రాలను జలీల్‌ఖాన్ అందజేసేందుకు వెళ్లగా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచారని ఆస్పత్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు వివరాలను వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు పంపించగా కేసు నమోదు చేశారు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
వైఎస్సార్ సీపీ నేతలు, సాక్షి మీడియా ప్రతినిధుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా జలీల్‌ఖాన్ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ ప్రారంభించారు. జలీల్‌ఖాన్ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వెళ్లారు, దాడిలో ఎవరు పాల్గొన్నారు, వారి పేర్లను సేకరించినట్లు సమాచారం. జలీల్‌ఖాన్ కార్యాలయంలోకి అనధికారికంగా లోపలకు వెళ్లి ఉంటే విప్ ప్రతిని ఏవిధంగా తీసుకుంటారనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు. మీడియా ప్రతినిధులు కెమేరాలను తన కార్యాలయంలో వదిలి పారిపోయారని జలీల్‌ఖాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్షలాది రూపాయల కెమేరాలను అక్కడ ఎందుకు వదిలి వెళతారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
దాడిలో ముస్లిం మేధావుల ఫోరం నేతలు
జలీల్‌ఖాన్ కారు డ్రైవర్‌తోపాటు ముస్లిం మేధావుల ఫోరం నేతలు, టీడీపీ నాయకులు అల్తాఫ్, అస్లాంలు మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరిచినట్లు ప్రాథమికంగా పోలీసులు ధ్రువీకరించినట్లు సమాచారం. మిగతా వారి గురించి విచారిస్తున్నారు.
భౌతిక దాడులు సరికాదు : పీసీసీ నేత ఆకుల
మీడియా ప్రతినిధులపై జలీల్‌ఖాన్ భౌతిక దాడులకు తెగబడటంపై పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. స్థానిక మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జలీల్‌ఖాన్ ఏ పార్టీ ఓట్లతో గెలిచారో దానిని కాదని బయటకు వచ్చినప్పుడు రాజీనామా చేయటం పద్ధతి అని పేర్కొన్నారు.