
నన్ను పెళ్లికూతురిని చేసింది సావిత్రే
హైదరాబాద్: తనను పెళ్లి కూతురిగా అలంకరించింది మహానటి సావిత్రి అక్కేనని ప్రముఖ సినీనటి జమున గుర్తు చేసుకున్నారు. సావిత్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకునే మొదటి అర్హత తనకే ఉందన్నారు. శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గురువారం రాత్రి రవీద్రభారతిలో ప్రజానటి జమునను ‘మహానటి సావిత్రి ఆత్మీయ పురస్కారం’తో సత్కరించారు. ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. జీవితం మన చేతుల్లో లేదని, ఎలా కలుస్తామో.. ఎలా విడిపోతామో తెలియదన్నారు. సావిత్రి సమస్యల వలయంలోకి చిక్కుకోవటం బాధాకరమన్నారు.
ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. రవీంద్రభారతి అద్దె పెంపుపై కళా సంస్థల నిర్వాహకులు కలిసివస్తే సీఎంతో మాట్లాడించి తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ అభినయానికి నిదర్శనం సావిత్రి, జమునలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ మహిళా అధ్యక్షురాలు జి.నాగలక్ష్మికి ‘సేవా శిరోమణి పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమని పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శృతిలయ చైర్మన్ ఆర్.ఎన్.సింగ్, వ్యవస్థాపక కార్యదర్శి ఆమని తదితరులు పాల్గొన్నారు.