‘ప్రజాభ్యుదయమే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘సాక్షి’ దినపత్రిక నేటితో ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వసంతంలోకి అడుగిడింది. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ, నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ, అక్రమాలపై అక్షర సమరం సాగిస్తోంది. నీతిమాలిన రాజకీయాలను కడిగిపారేస్తూ అక్షర ప్రస్థానాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది.
తద్వారా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ప్రజల మనస్సాక్షిగా విరాజిల్లుతోంది. ప్రజల కష్టనష్టాల్లో వెన్నంటి నిలుస్తూ వారి ఆత్మీయ‘సాక్షి’గా నిలుస్తోంది. పని చేయని అధికారులను వెలేత్తిచూపుతూ పని చేయిస్తోంది. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఊతకర్రలా నిలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ పథకాల అమలులో చోటు చేసుకుంటున్న జాప్యాన్ని, అర్హు ల పొట్ట కొడుతూ అనర్హులకు పెద్దపీట వేస్తున్న వైనాన్ని నిలదీస్తూ అర్హులకు పక్కా న్యాయం జరిగేందుకు ‘సాక్షి’ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ‘హాస్పిటల్ విజిట్’ పేరుతో జిల్లాలోని పీహెచ్‌సీల పనితీరును వేలెత్తి చూపింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌లో ప్రజలు విన్నవించుకున్న సమస్యలు పరిష్కారం కాని వైనాన్ని తెలియజేస్తూ.. బాధితుల ఆవేదనకు అక్షర రూపం ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పాట్లను ‘ఫోకస్’ చేస్తూ పరిస్థితిలో మార్పు తేవడానికి కృషి చేస్తోంది. ఇదే తరుణంలో బాగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తూ స్ఫూర్తిదాయక కథనాలు ప్రచురిస్తోంది.
మహిళలకు అండగా..
ఇంట్లో మహిళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఆ కుటుంబం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగా మహిళలను ప్రోత్సహిస్తూ ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలు ప్రచురిస్తోంది. మహిళల కష్టనష్టాలు, విజయగాధలు, జీవనపోరాటాలను ఆవిష్కరిస్తోంది. ‘నా కూతురే నా జీవితం’ శీర్షిక ద్వారా భర్తలను కోల్పోయిన మహిళలు తమ బిడ్డల భవిత కోసం తపిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టింది. ఎందరో మహిళలు తమ కూతుళ్లను టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారాలు..
ప్రజా అవసరాలను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు గుర్తించి, వారికి తగిన సమాచారాన్ని కమ్యూనిటీ పేజీల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ప్రచురితమైన కథనాల వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. అనేక సమస్యలు పరిష్కారమయ్యా యి. ‘అటెన్షన్ ప్లీజ్’ శీర్షిక కింద ప్రచురితమైన అనేక ఫొటో కథనాలకు అధికారులు స్పందించి.. వెంటనే పరిష్కార మార్గం చూపారు. ప్రజల వద్దకే అధికారులను తీసుకొచ్చి, వారి సమస్యలను వినేలా ‘సాక్షి’ నిర్వహించిన బృహత్తర కార్యక్రమం ‘జన సభలు’.
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జనసభలు నిర్వహించింది. వీటికి పురపాలక, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను ఆహ్వానించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా, అర్జీల రూపంలో అందించేందుకు తోడ్పడింది. వాటిని పరి శీలించిన అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పలుచోట్ల అక్కడికక్కడే పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. ‘సాక్షి’ ఫోకస్ శీర్షికన చాలా అంశాలను, సమస్యలను వెలుగులోకి తెచ్చింది. చాలా సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకతను అధికారులకు తెలియజెపుతూ ప్రభుత్వ వైఫల్యాన్నీ ఎండగట్టింది.
నిరక్షరాస్యులకు విద్యాబుద్ధులు నేర్పిన ‘అక్షర సాక్షి’
నిరక్షరాస్యత అభివృద్ధికి అవరోధం. ఈ విషయాన్ని గుర్తించిన ‘సాక్షి’ గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుంది. ‘అక్షరసాక్షి’ పేరుతో సాక్షరతా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందుకోసం నియమించిన కో ఆర్డినేటర్.. పల్లె పల్లె తిరుగుతూ... చదువు లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు, చదువుకుంటే కలిగే లాభాలను మహిళలకు వివరించారు. దీంతో వందలాది మంది నిరక్షరాస్య మహిళల్లో చదువుపై ఆసక్తి కల్గింది. చాలా మంది దినపత్రికలు చదివే స్థాయికి ఎదిగేలా కృషి చేసింది.
వ్యవ‘సాయం’
జిల్లా రైతన్నలకు ‘సాక్షి’ ప్రతి నిత్యం చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఈ అక్షరసత్యాన్ని జి ల్లాలో ఏ మారుమూల గ్రామానికి చెందిన రైతు ను అడిగినా ఇట్టే చెబుతాడు. ఖరీఫ్, రబీ సీజన్లకు అనుగుణంగా ఎప్పుడు ఏ పంట సాగు చేసుకోవాలి.. పాటించాల్సిన జాగ్రత్తలు.. ఇతరత్రా యాజమాన్య పద్ధతుల గురించి అర్థమయ్యే రీతిలో ‘పాడిపంట’ ద్వారా వివరిస్తోంది.
పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులను పేరెన్నికగన్న శాస్త్రవేత్తలు, అధికారుల సాయంతో రైతులకు తెలియజేస్తోంది. భూసార పరీక్షల ప్రాముఖ్యత గురించి వివరించి.. రైతుల్లో చైతన్యా న్ని రగిల్చింది. అవసరానికి మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పింది. సేంద్రియ ఎరువుల వాడకం దిశగా రైతులను ప్రోత్సహించింది. అక్షర యజ్ఞం ద్వారా వ్యవ‘సాయాన్ని’ నేటికీ కొనసాగిస్తూనే ఉంది.
‘సాక్షి‘ చొరవ.. పరిశోధక సీట్ల పెంపు
- వైవీయూ చరిత్రలోనే గొప్ప మలుపు
యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థుల ప్రవేశపరీక్ష -2011లో జరిగిన అవినీతి, అక్రమాలను ‘ఇష్టారాజ్యం’ పేరుతో 2012 జనవరి 23న సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ప్రవేశాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, రిజర్వేషన్ ప్రక్రియలో లోపాలు, సాక్షాధారాలతో ప్రచురించింది. దీంతో విద్యార్థి లోకం వైవీయూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టింది. వైవీయూ వైస్ చాన్స్‌లర్, అధ్యాపక బందం కలిసి చర్చించి అప్పటి వరకు ఉన్న 100 సీట్లతో పాటు అదనంగా మరో 100 సీట్లు అర్హులైన వారికి కేటాయించారు. ఈ సంఘటన వైవీయూ చరిత్రలో పెనుమార్పులకు కేంద్ర బిందువైంది.