కర్నూలు జేసీ హరికిరణ్
కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ)గా చెవ్వూరు హరికిరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఈయనను మొదటిసారిగా కర్నూలు జేసీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని పర్లాకిమిడి ఈయన స్వగ్రామం. ఈయన తండ్రి వైద్యుడు, తల్లి లెక్చరర్. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినకు ఈయన 2010-11 వరకు కృష్ణా జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు.
అనంతరం ఏడాదిపాటు భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, 2012-13 చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. 2013 అక్టోబరు 29న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి 14 నెలలపాటు విధులు నిర్వహించారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
కార్పొరేషన్ అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే వాదన ఉంది. కానీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మాత్రం ముందుండేవారన్న పేరుంది. ప్రభుత్వం బదిలీ చేయడంతో సంక్రాంతి పండుగలోపు బాధ్యతలు చేపట్టనున్నట్లు ‘సాక్షి’కి హరికిరణ్ వెల్లడించారు.
కన్నబాబు బదిలీ
కర్నూలు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. 2012 నవంబరు 30న జేసీగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ల పాలనలో తనదైన ముద్ర వేశారు. మైనార్టీ భూముల రక్షణకు చర్యలు చేపట్టారు. ఇసుక, ఖనిజం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో జిల్లా ముందుండేలా కృషి చేశారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుర్తించిన విలువైన భూములకు కంచెలు ఏర్పాటు చేయించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టారు.