
బాధిత కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
అనంతపురం సెంట్రల్: తమ షాపును కబ్జా చేసి.. బెదిరింపులకు దిగుతున్న జేసీ ప్రబాకర్‌రెడ్డి తీరుపై బాధితులు కన్నెర్రజేశారు. అనంతపురంలోని కమలానగర్‌లో కబ్జా చేసిన తమ షాపును తక్షణమే ఖాళీ చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన దిగారు. ప్రజాప్రతినిధే కబ్జాకు పాల్పడితే ఎలా అంటూ మండిపడ్డారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులు అడ్డుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ మల్లికార్జున ఆచారి తనకు తండ్రి నుంచి వంశపారంపర్యంగా వచ్చిన కమలానగర్‌లోని ఓ చిన్న షాపును 2000 సంవత్సరంలో బాబయ్య అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడన్నారు. అయితే ఆ బాబయ్య యజమానికి తెలీకుండా షాపును జేసీ సోదరుల(ఎంపీ దివాకర్‌రెడ్డి – ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి)కు చెందిన ‘దివాకర్ రోడ్‌లైన్స్’ కార్యాలయానికి ఇచ్చారన్నారు. అప్పటి నుంచి వీరు షాపు యజమానికి నరకం చూపుతున్నారన్నారు.
రూ. 2వేలు మాత్రమే అద్దె ఇస్తున్నారని, బాడుగ పెంచాలని యజమానులు కోరితే దురుసుగా మాట్లాడుతున్నారన్నారు. బాడుగ పెంచేది లేదని, షాపు ఖాళీ చేసేది లేదని, ఏమి చేస్తావో చేసుకోపో అంటూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించినా బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. జేసీ సోదరులు తాడిపత్రిలో సాగిస్తున్న విషసంస్కృతిని అనంతపురంలో కూడా అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శులు రమణ, అల్లీపీరా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు నారాయణస్వామి, నాయకులు రజాక్, సుందర్రాజు, బాలయ్య, నారాయణస్వామి, హుస్సేన్, రమేష్, శ్రీనివాసులు, రామాంజనేయులు, ఖాజా, రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.