ఉద్యోగాలు అమ్మబడును | jobs for money in government department | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు అమ్మబడును

Published Sun, Dec 8 2013 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

jobs for money in government department

సాక్షి ప్రతినిధి, కడప: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే తలంపుతో అధికారపార్టీ నేతలున్నారు. అందుకు తగ్గట్టుగా సహకారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిబంధనలు కాదని కాంట్రాక్టులు మొదలుకుని ఉద్యోగాల వరకు కోరుకున్న వారికి అప్పగిస్తూ స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. పారదర్శకతతో చేపట్టాల్సిన నియామకాలలో అధికార పార్టీ నేతల సిఫార్సు, అనుకున్న మేరకు ధనం చేకూరితే నకిలీ సర్టిఫికెట్లకు సైతం ఉద్యోగాలు అప్పగిస్తున్నారు. జిల్లాలోని అధికారుల శైలి పాలకపక్ష పార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. తాజాగా ట్రాన్స్‌కో యంత్రాంగానికి ఆ జాబితాలో చోటు దక్కింది.
 రేయ్.. అబ్బీ  ఎందాక చదువుకున్నావ్... పాపం ఎన్ని రోజులని ఈసేద్యపు పనులతో కష్టపడతావ్... మన ఊరిలో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా వెళ్తావా! నేను మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తాను...
 సరేన్నా! నేను 10 మాత్రమే పాస్ అయ్యా... దానికి ఐటీఐ ఎలక్ట్రిషియన్ చదివి ఉండాలంట కదా..?
  అదంతా నేను చూసుకుంటాలే.. అధికారంలో ఉండగా ఇట్లాంటి చిన్న పనులు కూడా చేయించుకోలేమా! ఏందీ...
 సరేన్నా నీ ఇష్టం.
 ఇది గ్రామీణ నాయకులు నిరుద్యోగుల మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న సంభాషణ.. అంతలోనే రెండురోజులు గడిచాక... నువ్వు చెప్పింది నిజమేబ్బీ... ఐటీఐ చదివిండాలంటా! సరే నేను ఒక మాట చెబుతా వింటావా...ఏమీ లేదు. ఐటీఐ సర్టిఫికెట్టు నీపేరుతో నేనే తీసుకువస్తా.. ట్రాన్సుకో ఆఫీసర్లను మేనేజ్ చేయాలా. వాళ్లు రెండు లక్షలు అడుగుతాండారు... నువ్వు రెడీ అంటే చూడూ...ఉద్యోగం నీదే. అయినా పెద్దకారు పైరు దిగుబడే కదా... ఆలోచించు నువ్వు సిద్ధమైతే నేను రెడీ...
 సరేలేన్నా.. ఎంత కాలమని ఇట్లానే ఉండాలా... నేను ఆలెక్క తెస్తానుగానీ నువ్వు మాట్లాడి నాకే ఉద్యోగం ఇప్పించున్నా...
 ఈ సంభాషణలు  జిల్లాలో ఇటీవల జోరుందుకున్నాయి. అందుకు నిదర్శనంగానే ట్రాన్స్‌కోలో నియమాకాలు జరుగుతున్నాయి.  
 పైరవీలకే ప్రాధాన్యం
 కమలాపురం మండలం కుప్పూరివారిపల్లె సబ్‌స్టేషన్‌ను ఇటీవల ప్రారంభించారు. అందులో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్‌మెన్ పోస్టును భ ర్తీ చేశారు. ఆపరేటర్ పోస్టుకు ఐటీఐ ఎలక్ట్రీ షియన్ పూర్తి చేసి ఉండాలనేది  కనీస నిబంధన. స్థానిక నాయకుడు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తెచ్చుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి నలుగురు ఆపరేటర్ల పోస్టులలో తన వారిని నియమించుకున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు, లక్షలో నగదు వస్తుండటంతో ఆలస్యం చేయకుండా ట్రాన్స్‌కో యంత్రాంగం ఉద్యోగాలను కట్టబెట్టింది.  సర్టిఫికేట్లు నకిలీనా..! ఒరిజినలా అని చూడకుండా ఉద్యోగాలను కట్టబెట్టారు. ట్రాన్సుకో పేరు చెప్పి గ్రామీణ నాయకుడు సందిట్లో సడేమియా అన్నట్లుగా ఒక్కొక్కరి నుంచి రూ. 2లక్షలు వసూలు చేసి జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల జిల్లాలో 17 సబ్‌సేష్టన్లను నూతనంగా నిర్మించారు. వాటిల్లో సుమారు 85 మందిని (ఆపరేటర్లు, వాచ్‌మెన్లు) ఉద్యోగాలలో నియమించారు. ప్రతి సబ్‌స్టేషన్ లోనూ స్థానిక నాయకుల పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేశారు. ఈమొత్తం వ్యవహారంలో దాదాపు రూ. కోటికి పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది.
 వెరిఫికేషన్ ఏదీ..!
 గతంలో  సబ్‌స్టేషన్ ఆపరేటర్ల  నియామకాలను  స్థానిక ట్రాన్స్‌కో ఏడి స్థాయి అధికారి చేసేవారు. కాలక్రమేణా  అధికార పార్టీ నేతల పైరవీలతో గ్రామస్థాయి నేతలు తమ అనుచరులకు  ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు.  ఆశాఖ ఉన్నతాధికారి జోక్యంతో ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా నియామకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల  పైరవీ లేఖలతో పాటు, నగదు ముట్టజెప్పకపోతే నియామకాలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో నకిలీ సర్టిఫికేట్లు ఉన్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను  వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. అటువంటి చర్యలు ఏమాత్రం తీసుకుంటున్న దాఖలాలు లేవు.
 ట్రాన్‌కో ఎస్‌ఈ గంగయ్య ఏమంటున్నారంటే..
 నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలొస్తే విచారణ చేసి అలాంటి వారిని తొలగిస్తున్నాం. పాయసంపల్లె సబ్‌స్టేషన్‌లో ఇరువురిని తొలగించాం. కప్పూరువారిపల్లె నియామకాలపై విచారణ కోసం ఆయా విద్యా సంస్థలకు పంపాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ఇకపై ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి సర్టిఫికెట్‌ను  విచారణకు పంపుతాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement