సమైక్యం కోసం ఏం చేస్తున్నారు? | Jupudi Prabhakar Criticises TDP, Congress | Sakshi
Sakshi News home page

సమైక్యం కోసం ఏం చేస్తున్నారు?

Published Sat, Dec 7 2013 4:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సమైక్యం కోసం ఏం చేస్తున్నారు? - Sakshi

సమైక్యం కోసం ఏం చేస్తున్నారు?

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్, టీడీపీలు ఒక్క ప్రయత్నమైనా చేస్తున్నాయా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీల నేతలను కలవడంతో పాటు అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలసి మద్దతు కూడగడుతుంటే... ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసి ఒకే మాటను వల్లెవేస్తూ తమపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆ పనిచేయకపోగా కొబ్బరికాయ సలహాలిస్తూ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన తర్వాత నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు అడగటం, అదే లైన్‌లో కేంద్రం ముందుకెళ్లడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజల మనోభావాలను గాలికొదిలేసి సిగ్గులేకుండా సొల్లుకబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందంటూ దొంగ ఏడుపు ఏడుస్తున్న లగడపాటి రాజగోపాల్ ఇంకా అదే పార్టీలో ఎందుకు కొనసాగుతున్నట్లని సూటిగా ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆపార్టీకి రాజీనామా చేయడంతో పాటు వెంటనే రాష్ట్రపతి వద్దకెళ్లి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
 బంద్‌కు బాబు మద్దతెందుకివ్వలేదు: వాసిరెడ్డి పద్మ
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, దీనివల్ల నష్టపోయే ప్రాంతాల్లో జరుగుతున్న బంద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మద్దతివ్వలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విభజనవల్ల సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగడంలేదని బాబు భావిస్తున్నారా? విభజనను సమర్థిస్తున్నారా? అని అడిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను అడ్డుపెట్టుకొని  కృష్ణానదీ మిగులు జలాలు దక్కకుండా చేసిన సోనియాగాంధీ చర్యలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమ అధినేత జగన్ నిర్ణయించారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement