చీకట్లోనే రైలు దిగిపోతున్న ప్రయాణికులు
గుంతకల్లు: ఆ రైలుకు అర్ధరాత్రి అంటే ఎంతో ఇష్టమున్నట్లుంది. అందుకే సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరుకోవాల్సిన ఈ రైలు... తన జీవిత కాలంలో ఏనాడూ సమయానికి గమ్యం చేరిన దాఖలాలు లేవు. విసిగి వేసారిన ప్రయాణీకులు అసహనంతో ఆ రైలుకు ఓ ముద్దు పేరు పెట్టారు. అదే దెయ్యాల బండి. ఈ బండిని ఎక్కాలంటే ప్రయాణీకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఉదయం 10.00 గంటలకు బయలుదేరే ఈ ప్యాసింజర్ రైలు... అనేక స్టేషన్లు దాటుకొని సాయంత్రం 7.20 గంటలకు గుంతకల్లు చేరాల్సి ఉంది.
అయితే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంల కొరత, క్రాసింగ్‌లు, చైను లాగడాలు తదితర కారణాల వల్ల ఏనాడూ ఈ రైలు అనుకున్న సమయానికి గుంతకల్లుకు చేరలేదు. ఎటు తిరిగి సరిగ్గా అర్ధరాత్రి సమయానికి గుంతకల్లు రైల్వే జంక్షన్ చేరి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంది. దీంతో ముఖ్యంగా మహిళలు ఈ రైలు ఎక్కాలంటేనే భయపడిపోతారు. సిగ్నల్స్ అందక స్టేషన్ బయట పొలాల్లో గంటల తరబడి నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఊరి బయట చిమ్మచీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అసలే భద్రత కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రైలులో ప్రయాణించే అరకొర ప్రయాణికులు రాత్రివేళ ఒకే పెట్టెలోకి చేరుకొని పరస్పర దైర్యం చెప్పుకునే ఘటనలు సర్వసాధారణంగా మారాయి. }
గుంతకల్లు రైల్వే జంక్షన్ ఔటర్‌లో నిలిచిపోయిన కాచిగూడ ప్యాసింజర్
ఔటర్‌లోనే ఆగిపోతుంది
కాచిగూడ నుంచి ఇప్పుడా..అప్పుడా అన్నట్లు పరిగెత్తుకు వచ్చే ఈ ప్యాసింజర్...గుంతకల్లు సమీపించే కొద్ది మారాం చేస్తుంది. సిగ్నల్స్ అందక గంటల కొద్దీ (డీఆర్‌ఎం కార్యాలయ సమీపంలో) ఔటర్‌లోనే నిలిచిపోతుంది. నిరీక్షించే ఓపిక నశించిన ప్రయాణికులు రైలు దిగి ముళ్లకంపల మధ్య నడుచుకుంటూ ఇళ్లకు వెళుతుంటారు. ట్రాక్‌పై కంకర మధ్య నడుచుకుంటూ జారిపడిన ఘటనలు కూడా అనేకంగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా 9.00 గంటలకు గుంతకల్లు సమీపానికి చేరుకున్న ఈ రైలు ఔటర్ నుంచి జంక్షన్‌లోకి 11.00 గంటలకు చేరింది. సుమారు 2 గంటలపాటు ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ చిమ్మచీకట్లోనే గడిపారు.
నరకం అనుభవించాం
డోన్ నుంచి గుంతకల్లుకు ఈ రైలులో ప్రయాణం చేశా. సాయంత్రం 7.00 గంటలకు డోన్‌లో కదిలితే గుంతకల్లు ఔటర్‌కు 9.15 గంటలకు చేరుకుంది. మరో 10 నిమిషాల్లో ఇంటికెళ్లొచ్చు అని అనుకున్నా..కానీ గంటల కొద్దీ రైలును నిలిపి వేశారు.
– రాజు, ప్రయాణికుడు
ముళ్లపొదల్లో నడిచా
కాచిగూడ ప్యాసింజర్ రైలును గుంతకల్లు పట్టణ సమీపాన నిలిపి వేశారు. గంటల కొద్దీ కదలకపోవడంతో రైలు దిగి మొనతేలిన కంకర రాళ్ల మధ్య నడుచుకుంటూ ముళ్ల కంపలను దాటుకుంటూ రోడ్డున పడ్డాను.
–లక్ష్మీదేవి, ప్రయాణికురాలు
Comments
Please login to add a commentAdd a comment