హలో.. నేను కలెక్టర్ మాట్లాడుతున్నా
కలెక్టర్: నీ పేరు ఏమిటి?
రైతు: నా పేరు నరసింహారెడ్డి.
కలెక్టర్: ఎందుకు వచ్చావు.
రైతు:సార్.. నాకు పంట పొలం ఆన్‌లైన్ ఎక్కించడంలో అధికారులు తిప్పుతున్నారు. అందుకే ఇక్కడికి వచ్చా.
కలెక్టర్: అవునా ... ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు. అసలు సమస్య ఏమిటీ..
రైతు:సమస్య ఏమిటో నాకు తెలియదు సార్. నేను దాదాపు ఐదారు నెలలుగా తిరుగుతున్నా.
కలెక్టర్:ఓకే.. నాకు అర్థమైంది. నేను తహసీల్దార్‌తో మాట్లాడతా ఉండు.
కలెక్టర్: హలో .. తహసీల్దార్ గారూ.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. ఎందుకు నరసింహారెడ్డికి సంబంధించిన పొలం విస్తీర్ణం ఆన్‌లైన్‌లో ఎక్కించలేదు. మీకు ఉన్న ప్రాబ్లం ఏమిటి. ఇన్ని రోజులుగా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు. ఎప్పుడు పరిష్కరిస్తారు. మళ్లీ ఈ రైతు నా దగ్గరికి వస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. జాగ్రత్త.
దాదాపు రైతును 5 నిమిషాల పాటు తన వద్ద ఉంచుకుని ఆ సమస్యపై కింది స్థాయి అధికారితో మాట్లాడి స్వయంగా కలెక్టరే ఇన్ని రోజుల్లో పరిష్కారమవుతుందని చెప్పడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు.
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన శైలిలో అధికారుల్లో మార్పు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న కలెక్టర్ బాబురావు నాయుడు ఏది చేపట్టినా అది సంచలనమే అవుతోంది. ప్రత్యేకంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ వచ్చిన కలెక్టర్ ఇప్పుడు ఒక నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.
కడప కలెక్టరేట్‌లో నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కలెక్టర్ కూడా ప్రస్తుతం ల్యాప్‌ట్యాప్ ద్వారా కొత్త విధానంతో అక్కడికక్కడే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ప్రజలు అర్జీలు తీసుకుని తన వద్దకు రాగానే కలెక్టర్ అక్కడే పరిశీలించి.. అక్కడే పరిష్కారం చూపడం..మండల కేంద్రాలకు సంబంధించి సమస్య అక్కడే పరిష్కారం కావాల్సిన పరిస్థితుల్లో ల్యాప్‌ట్యాప్ ద్వారా సంబంధిత మండల కేంద్రానికి ఫోన్ చేసి కలెక్టర్ స్వయంగా మాట్లాడుతున్నారు.
మొదటగా ‘హలో.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా మీ మండలంలోని ఫలానా గ్రామానికి చెందిన రైతు వచ్చాడు. ఇతనికి సంబంధించి ఫలానా సమస్య పెండింగ్‌లో ఉంది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు పరిష్కారం చేయలేదు. మీ దగ్గరికి చాలా సార్లు తిరిగినా పట్టించుకోలేదు, ఇప్పుడు నా వద్దకు వచ్చాడు. అలాంటి పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి, ఇప్పుడు ఆ రైతును మీ దగ్గరికే పంపిస్తున్నా, సమస్యను పరిష్కరించండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి.
వారిని మాత్రం ఇబ్బందులకు గురిచేయొద్దని’ అక్కడికక్కడే జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ ల్యాప్‌ట్యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తరహాలో మండల అధికారితో మాట్లాడి పరిష్కారం చూపుతుండటం గమనార్హం. కలెక్టర్ ప్రారంభించిన ఈ కొత్త విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కలెక్టర్ ల్యాప్‌ట్యాప్‌లో చూస్తూ అవతలి అ«ధికారితో మాట్లాడుతుండగా హాల్‌లో ఏర్పాటు చేసిన స్క్రీన్ మీద జిల్లా కలెక్టర్‌తోపాటు బాధిత రైతు, మండల కేంద్రంలోని అధికారులు కూడా ఇక్కడి స్కీన్ మీద కనిపిస్తుండటం కొత్త విధానం ప్రత్యేకత.