లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.
అదేవిధంగా, బ్రిటన్‌లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్‌తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్‌తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment