శ్రీలంక విదేశాంగశాఖ మంత్ర అలీ సబ్రీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కెనడా భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై మంగళవారం ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొంతమంది ఉగ్రవాదులకు కెనడా సురక్షిత ప్రాంతంగా మారిందని విమర్శించారు. అందుకే కెనడా ప్రధాని ట్రూడో ఎటువంటి ఆధారాలు లేకుండానే దారుణమైన ఆరోపణలతో ముందుకొచ్చినట్లు అనిపిస్తోందని దుయ్యబట్టారు.
ఇలాంటి ఆరోపణలే శ్రీలంకపై కూడా చేశారు. కానీ మా దేశంలో ఎలాంటి హత్యాకాండ జరగలేదని అందరికీ తెలుసు. అంతేగాక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలతో కలిసి పనిచేసిన వారికి కెనడా పార్లమెంట్‌లోకి ట్రూడో ఆహ్వానించి, సత్కరించడం నిన్న చూశాను. ఆయన చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. ట్రూడో సంగతి నాకు తెలుసు. అందుకే నిరాధార ఆరోపణలతో ట్రూడో ముందుకు రావడం నాకేం ఆశ్యర్చం అనిపించలేదు.
చదవండి: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించిన సందర్భంగా అక్కడి పార్లమెంట్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి రెండో ప్రపంచ యుద్ధ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను స్పీకర్ ఆంటోనీ రోటా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడు అంటూ స్పీకర్ పొగడటంతో.. అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, జలెన్‌స్కీ సహా అందరూ నిల్చొని చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు.
దీనిపై వివాదం చెలరేగడంతో.. పొరపాటు జరిగిందంటూ ఆదివారం స్పీకర్ ఆంటోనీ క్షమాపణలు చెప్పారు. దీనిపై తాను రాజీనామాకు కూడా సిద్దమేనని ప్రకటించారు. అటు, కెనడా ప్రధాని ట్రూడో కూడా ఇలా జరిగినందుకు కలత చెందానని అన్నారు. ఇది కెనడా పార్లమెంటుకు, కెనడియన్లందరికీ చాలా ఇబ్బందికరమైన విషయం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment