టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు | Kadapa Parliamentary Incharge Suresh Babu Has Severely Criticized Chandrababus Style | Sakshi
Sakshi News home page

టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు

Published Thu, Sep 12 2019 10:37 AM | Last Updated on Thu, Sep 12 2019 10:37 AM

Kadapa Parliamentary Incharge Suresh Babu Has Severely Criticized Chandrababus Style - Sakshi

మాట్లాడుతున్న కె.సురేష్‌బాబు, చిత్రంలో ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి, పార్టీ నాయకులు 

సాక్షి, కడప కార్పొరేషన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనకు ప్రజల నుంచి వస్తున్న ప్రశంసలు, మన్ననలను ఓర్వలేకే ప్రతిపక్షనేత చంద్రబాబు పక్కదారి పట్టించేందుకు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం చేపట్టారని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, మైదుకూరు  ఎమ్మెల్యే ఎస్‌ రఘురామిరెడ్డి  విమర్శించారు. బుధవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌ వంద రోజులు విజయవంతంగా పాలన అందించారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు  సంబంధించి 20 అంశాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి 19  తీర్మాణాలు ఆమోదించారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 75 శాతం హామీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సచివాలయాల పరీక్షలు 8 రోజుల పాటు ఎక్కడా ఒక్క విమర్శ రాకుండా యూపీపీఎస్‌సీ తరహాలో నిర్వహించారని చెప్పారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తే తప్పులు జరుగుతాయని, ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి తెచ్చినా మెరిట్‌ ప్రాతిపదికన పారదర్శకంగా ఉద్యోగాలిస్తున్నారని, తద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అక్టోబర్‌ నుంచి తెస్తున్నారని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు గుర్తించి ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటూ, అన్ని సామాజిక వర్గాలకు మేలు చేకూరే విధంగా ప్రతినెలలో ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా షడ్యూల్‌ ప్రకటించారన్నారు.  వైఎస్‌ జగన్‌ వంద రోజుల పాలనపై అన్ని వర్గాల ప్రజల మన్ననలు, ప్రశంసలు ఓర్వలేక ప్రతిపక్షనేత చంద్రబాబు ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.  దళిత ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్‌ జుట్టు పట్టి ఈడ్చినప్పుడు, యరపతినేని ఆధ్వర్యంలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయినప్పుడు, కోడెల, ఆయన కుమార్తె, కుమారుడు విచ్చలవిడిగా అక్రమాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో లెక్కలేనన్ని అరాచకాలు, అక్రమాలు చేశారని ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆత్మకూరులో 40 ఏళ్లుగా ఫ్యాక్షన్‌ ఉందని, అక్కడ ఏడుగురిని హత్య చేశారన్నారు. దీన్ని బూచిగా చూపి ప్రజలను పక్కదారి పట్టించాలనుకోవడం దారుణమన్నారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా హౌస్‌ అరెస్ట్‌ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఇదంతా నీవు నేర్పిన విద్యే కదా అని వారు ఎద్దేవా చేశారు. ఆత్మకూరులో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయని, అందుకే చంద్రబాబును హౌస్‌ అరెస్ట్‌ చేశారన్నారు. కానీ గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి ఎప్పుడు జిల్లాకు వచ్చినా నిషేధాజ్ఞలు అమల్లో లేకపోయినా వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులను హౌస్‌ అరెస్టులు చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నీవు ప్రవేశపెట్టిన సంప్రదాయంపై ప్రశ్నించే హక్కు నీకుందా అని వారు నిలదీశారు. టీడీపీ హయాంలో వేలకోట్ల కాంట్రాక్టులు చేసి సంపాదించిన వారంతా ఏ పార్టీలో ఉన్నారో అందరీ తెలుసన్నారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరింది నీ అనుమతితో కాదా అని వారు సూటిగా ప్రశ్నించారు. బ్రహ్మం సాగర్‌లో నీటిని నింపాలని ఎంపీ, ఎమ్మెల్యేలమంతా ఎన్ని ఆందోళనలు, ధర్నాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, 0–18 కీ.మీ కాలువ పనులను పూర్తి చేసి 5వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చే వీలున్నా ఆ పని చేయలేదన్నారు.  డిసెంబర్‌ 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, కుందూ నుంచి తెలుగుంగకు లిఫ్ట్‌ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని తీసుకురావడానికి రూ.500కోట్లతో పనులు చేపట్టనున్నారని వివరించారు.  మాజీ జెడ్పీ వైస్‌ ఛైర్మెన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి,  వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యూత్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, బీసీ విభాçV ం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, చీర్ల సురేష్‌యాదవ్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement