ఆదర్శ సాహిత్యం చదివిన వ్యక్తి | Kadhalika Imam Article On YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

తెలుగుదనపు సంతకం

Published Mon, Sep 2 2019 2:42 AM | Last Updated on Mon, Sep 2 2019 2:42 AM

Kadhalika Imam Article On YS Rajasekhara Reddy - Sakshi

కరపత్రం ఆయనకు చూపిస్తే, కమ్యూనిస్టు ప్రణాళికలోని మార్క్స్‌ చెప్పిన ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే అంశాన్ని ఇలా మార్చి రాశావు అన్నారు.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిరంతరం తెలుగుదనం ఉట్టిపడే రీతిలో తన దుస్తులలోనూ, అలోచన సరళిలోనూ, నడకలోనూ, హావభావాలలోనూ మనకు కనిపించేవారు. తెల్లటి ఖద్దరు బట్టల వెనుక ఉన్న వెన్నెల లాంటి హృదయం సన్నిహితంగా ఆయనతో తిరిగిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆయన చిన్న వయస్సులో పులివెందులలోని ఆదర్శ కమ్యూనిస్టు వెంకటప్పయ్య ఇంటిలోనే ఒక బడి నివాసంలో విద్యను అభ్యసించారు. సోమవారం ఉదయమే తన ఇంటి నుండి వెంకటప్పయ్య పాఠశాలకు వెళ్లి అక్కడే చదువు, భోజనం, నిద్రతో శనివారం వరకు గడిపి, ఇంటికి తిరిగి వచ్చేవారు. వెంకటప్పయ్య కమ్యూనిస్టు సిద్ధాంతాల  ప్రభావంతో చాలా నిరాడంబరంగా ఉంటూ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూనే సామాజిక అంశాలను కూడా చెప్పేవారు. వేమన, శ్రీశ్రీ, గురజాడ లాంటి కవుల గురించీ, కమ్యూనిస్టు ప్రణాళిక గురించీ, శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’, మక్సీమ్‌ గోర్కీ ప్రఖ్యాత నవల ‘అమ్మ’ గురించీ చెప్పేవారు. వీరందరినీ వైఎస్‌ చదివినట్టుగా ఆయన జరిపే సంభాషణల్లో రుజువులు కనబడతాయి. వెంకటప్పయ్య దగ్గరికి రాజశేఖరరెడ్డిని వైఎస్‌ రాజారెడ్డి తీసుకెళ్లి, మీ స్కూల్లో మా వాడిని చేర్చుకోమని అడిగి, వీడిని నాయకుడిని చేయాలనుకుంటున్నామనీ, స్వామీ మీరు వాడికి రాజకీయాలు కూడా ఒక నాయకుడిలా ఎదగడానికి కావాల్సినంతగా చెప్పండి అని అన్నారు. అందువల్లే రాజశేఖరరెడ్డికి చక్కటి అ«ధ్యయన పద్ధతులు అబ్బాయి.

ఈ రచయిత ఒక సందర్భంలో ‘రైతులారా, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆలుబిడ్డలున్నారని మరువవద్దు. మీకు పోయేదేమీ లేదు భూమి తప్ప’ అని ఒక కరపత్రం రాసి ఆయనకు చూపిస్తే, కమ్యూనిస్టు ప్రణాళికలోని మార్క్స్‌ చెప్పిన ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే అంశాన్ని ఇలా మార్చి రాశావు అన్నారు. ఇటువంటిదే మరో సంఘటన. విద్వాన్‌ విశ్వం గారి పెన్నేటి పాటలోని కొన్ని చరణాలను తరతరాల రాయలసీమ పుస్తకం వెనుక అట్ట మీద వాడటం జరిగింది. అందులో ఒక చరణం సరిగాలేదనీ, తప్పుగా రాశాననీ నన్ను సవరించారు. ఆయన రాయలసీమ కావ్యం పెన్నేటి పాటను అంతగా చదివారని నాకు అర్థం అయింది. ఒక సందర్భంలో శ్రీశ్రీని కూడా ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

వైఎస్‌ తెలుగు భాషకు ప్రాచీన హోదా సాధించడంలో భాగంగా ప్రముఖ పత్రికా విలేకరి ఏబీకే ప్రసాద్‌ను తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించి ప్రాచీన హోదా సాధించడంలో విజయవంతం అయ్యారు. తిరుపతిలో రాయలసీమ ఎడిషన్‌ విశాలాంధ్ర ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో  వైఎస్‌ హాజరయ్యారు. తాను జీవితంలో మొట్టమొదటి సారిగా 8వ తరగతి చదువుతున్నప్పుడు తన ఇంటికి రోజూ వచ్చే విశాలాంధ్రను చదివేవాడిననీ, విశాలాంధ్ర నిర్వహించిన చారిత్రక బాధ్యత గొప్పదనీ ప్రస్తావించారు. వైఎస్‌ ఒక రూపాయి డాక్టరుగా ఉన్నా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, ఆ తర్వాత పత్రికలు క్షుణ్ణంగా చదవడం, జరిగిన సంఘటనలు నోట్‌ చేసుకొని ఆ అంశాల పై తగు విధంగా కార్యాచరణకు మలచుకోవడం జరిగేవి. 

ఆయన బైబిల్‌ను ఎంత అర్థం చేసుకున్నారో అచరణలో జీవితాన్ని కూడా బైబిల్‌లోని సారాంశంతో కలగలిపి గొప్ప మానవతావాదిగా ఎదిగాడు. అంత మాత్రం చేత హిందూ మతం పట్ల, ఇస్లాం పట్ల గాని ఆయనకి గౌరవం తగ్గలేదు. బైబిల్, ఖురాన్, భగవద్గీతను అర్థం చేసుకొని అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా ఆయన ఎదిగాడు. 

చాలా ఆశ్చర్యము, ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే– 1983లో ఆయన బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో నిర్మించుకున్న ఇంటికి శ్రీబాగ్‌ అని పేరు పెట్టుకోవడం. ఇది ఆయన రాజకీయ పరిణతికి చిహ్నం. చరిత్రలో శ్రీబాగ్‌ ఒడంబడిక  ప్రాముఖ్యతను ఆయన గుర్తించినట్లుగా మరెవరూ గుర్తించలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు, తెలుగు రాష్ట్రం కొరకు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడాలని జరిపిన ఉద్యమంలో కోస్తా నాయకులకూ, రాయలసీమ నాయకులకూ 1937లో మధ్య జరిగిన ఈ ఒప్పందం... నేడు రాష్ట్రంలో కేంద్రీకృత అభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలకమైనది.

రాయలసీమలో సేద్యపునీటి ప్రాజెక్టులను కోరుతూ లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడుకు 1986లో వైఎస్‌ జరిపిన పాదయాత్రలో నడవడంతో ఆయనలో పట్టుదలను నేను గమనించాను. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన ప్రజాప్రస్థానం తెలుగు రాజకీయాలను ఒక ఊపు ఊపింది. రాజకీయాల మార్పునకు పునాది వేసింది. ఆ పాదయాత్రలోనూ ఆయనను సన్నిహితంగా చూసే భాగ్యం నాకు దక్కింది. ప్రజలతో ఆయన మాట తీరు సులువుగా వారి గుండెలకు హత్తుకునేలా ఉండేది. వెంకటసుబ్బయ్య పాఠశాలలో ఆయనలో గొప్ప అభివృద్ధి కాంక్షకు బీజాలు పడ్డాయి. ప్రజలలో నిరంతరం సంబంధాలు కలిగి ఉండడంతో మరింతగా ఆలోచనలు పదునెక్కాయి. ఒక మంచి కార్యకర్త ఒక మంచి నాయకుడు అవుతాడు. ఒక నాయకుడే ఒక మహా నాయకుడు అవుతాడు. నిరంతర పఠనం, పరిస్థితులను ఆకళింపు చేసుకునే విధానం ఆయన్ని  మహానాయకుడిగా చేశాయి. మంచి సాహిత్యాన్ని జీర్ణం చేసుకున్న వ్యక్తి సమాజాన్ని అర్థం చేసుకోగలడు అనేదానికి మారుమూల పులివెందుల నుండి జాతీయ స్థాయికి ఎదిగి వచ్చిన వైఎస్‌ జీవితం ఓ తార్కాణం.
-‘కదలిక’ ఇమామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement