గ్రీవెన్స్ డే సందర్భంగా సమస్యలు చెప్పుకోడానికి తన తల్లితో వచ్చిన చిన్నారి బుగ్గనిమురుతున్న కలెక్టర్ (ఫైల్)
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేదీ...అంటూ... వికసించిన పుష్పాలను చిదిమేస్తున్న ఆ శివుడినే ఓ సినిమాలో గేయ రచయిత నిలదీశాడు ఆదుకోవాల్సిన ఆది దేవుడే ఆయుష్షు తీస్తుంటే ఇక ఎవరు కాపాడతారనేదే ఆయన ఆవేదన... కార్తికేయుడు అంటేనే శివుడి కుమారుడు... వచ్చీ రాగానే గ్రీవెన్స్‌లో పిల్లలతో ముచ్చట్లు ఎంత ఒత్తిడి ఉన్నా బోసినవ్వు విరబూయగానే చిరు నవ్వుతో మీ పలకరింపే మాకు ఊరటనుకున్నాం మీ రాక మిణుకుమిణుకుమనే మా ప్రాణాలకు దీపమవుతుందనుకున్నాం... ఏటా పెరుగుతున్న చావు గ్రాఫ్‌లకు ఫుల్ స్టాప్ పడుతుందనుకున్నాం ఇదేంటి అంకుల్... పిట్టల్లా అలా రాలిపోతున్నాం గతమంతా విషాదమే...! భవితనైనా బంగారం చేయరూ... ఇక పుట్టే మా చెల్లీ, తమ్ముళ్లకు ఊపిరి పోయరూ...
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చిన్నారులను చూస్తే మురిసిపోతారు... పిల్లలు కనిపిస్తే చాలు అక్కున చేర్చుకుంటున్నారు. సమస్య చెప్పుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన పసిపిల్లలను మురిపెంగా ముద్దాడుతున్నారు. తనతో తెచ్చుకున్న చాక్లెట్లను ఇచ్చి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రాను తరుచూ పరిశీలిస్తున్న వారికి, దగ్గరి నుంచి చూసేవారికి ఈ విషయాలు తెలిసినివే. పిల్లల్ని చూసి తానో పిల్లాడిగా మారిపోతున్న కలెక్టర్‌కు కాకినాడ జీజీహెచ్‌లో ఆసుపత్రిలో చోటుచేసుకుంటున్న శిశు మరణాలు మాత్రం కనిపించడం లేదా...? తన వద్దకొచ్చే వారే పిల్లలా? లోకం చూడకుండానే కళ్లు మూస్తున్న శిశువుల్ని పిల్లలుగా చూడటం లేదా? ప్రతిరోజూ వినిపిస్తున్న శిశు మరణ ఘోష మీ దృష్టికి రావడం లేదా...? అని పసి పిల్లలను కోల్పోయిన తల్లులు ప్రశ్నిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా చోటుచేసుకుంటున్న శిశు మరణాలు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా దృష్టికి రాకపోవచ్చు. కాకినాడ జీజీహెచ్‌లో అందుతున్న వైద్య సేవలపై పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు. కానీ ఆయనొచ్చాక కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో అనేక శిశు మరణాలు సంభవించాయి. గతం తెలియకపోయినా ఇటీవల చోటుచేసుకుంటున్న మరణాలైనా కదలించాలి. లోపం ఎక్కుడుందో గుర్తించి, శిశు మరణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్క కాకినాడ జీజీహెచ్‌లోనే ఇందుకిలా జరుగుతోంది? కారణాలేంటి? క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పరిస్థితులేంటి? ఆరాతీసి తదననుగుణంగా అధికారుల్ని పరుగులు తీయించాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కాకినాడ జీజీహెచ్ శిశు మరణాలపై సమీక్ష చేసిన దాఖలాల్లేకపోవడమే ఇందుకు కారణం.
అభివృద్ధి కమిటీ విషయంలో చొరవేదీ...?
ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ ఉంటేనే దేనిపైనైనా చర్చ జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఎప్పటికప్పుడు సమస్యలు, లోపాలు తెలుసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి పనితీరు ఎలా ఉందో? శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో? ఆరా తీసేందుకు అవకాశం ఉంటుంది. తదననుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ కాకినాడ జీజీహెచ్‌కు ఆ యోగం లేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి మోక్షం కలగడం లేదు. కనీసం తానొచ్చాకైనా చొరవ తీసుకోవాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఆ మధ్య కలెక్టర్ మిశ్రా అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అభివృద్ధి కమిటీ కోసం 11 మంది సభ్యులతో కూడిన జాబితా రూపొందించాలని మౌఖికంగా ఆదేశించారు. కానీ ఆస్పత్రి అధికారులు ఆమేరకు వెంటనే స్పందించ లేదు. తర్వాతైనా ప్రతిపాదిత రూపంలో కమిటీ సభ్యుల జాబితాను రూపొందించ లేదు. కలెక్టర్ ఏ విధంగానైతే మౌఖికంగా ఆదేశించారో అదే తరహాలో ఆస్పత్రి అధికారులు కూడా సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. దీంతో కాగిత రహిత వ్యవహారమైపోయింది.
ఒక్క సంతకంతో అయిపోయే పని
వాస్తవానికైతే...ఈ కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంఈ, సూపరింటెండెంట్, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్, ఈఈ ఏపీఐఎండీసీ, మున్సిపల్ కమిషనర్లతోపాటు ఇద్దరు దాతృత్వం ఉన్నవారిని, ఒక ఎన్‌జీవో, గైనిక్ సమస్యలు తెలిసిన వ్యక్తి, పేదరికంపై కృషి చేసిన వారితో కలిపి మొత్తం 11 మందితో కూడిన కమిటీ ఏర్పాటు కావాలి. ఒక్క సంతకంతో అయిపోయే పనిదీ. కానీ ఆ కమిటీపై ఎవరికీ ధ్యాస లేకుండా పోయింది. ఆస్పత్రికి ఒక కమిటీ ఉండాలన్న విషయాన్ని సైతం మరిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆస్పత్రి పాలన దైవాదీనంగా మారిపోయింది. ఇదంతా చూస్తుంటే ఆస్పత్రి వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి సారించడం లేదా? కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా చేస్తున్నారా? వెళ్లినా కలెక్టర్ పట్టించుకోవడం లేదా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఏటా చోటు చేసుకుంటున్న వందలాది శిశు మరణాల దృష్ట్యా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment