
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని, ఈ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు కలిగిస్తున్న అపోహలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం విజయవాడలో కన్నా ఆవిష్కరించారు.
మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ఎటువంటి జోక్యం చేసుకోదని, ఇది బీజేపీ తరఫున అధికారికంగా చేస్తున్న ప్రకటన అని జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. ‘నేనూ దానికి తేడాగా చెప్పడం లేదు కదా?’ అని కన్నా ప్రశ్నించారు. మీడియానే భిన్నంగా అర్థం చేసుకుందన్నారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, ఇప్పుడు దాన్ని మార్చే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు.