
రవికుమార్‌కు దమ్ముంటే మాతో తలపడాలి
గుంటూరు : టీడీపీలోకి కొత్తగా వచ్చినవారి వల్లే గొడవలు జరుగుతున్నాయని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల దాడిలో గాయపడి, చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. గొట్టిపాటి రవికుమార్ ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. విచక్షణారహితంగా అమాయకులను వెంటాడి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే గొట్టిపాటి రవికుమార్ తమతో తలపడాలని, అంతేకానీ టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు.
తన స్వలాభం కోసమే రవికుమార్ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు అడ్డొచ్చినవారిని చంపేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మాట రాకూడదనే తాము ఓపిక పట్టామని అన్నారు. ఇప్పటికైనా గొట్టిపాటి రవికుమార్ అందర్ని కలుపుకుపోవాలని సూచించారు. స్వలాభం కోసమే గొట్టిపాటి టీడీపీలో చేరారన్నారు. చనిపోయినవారంతా 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసారని కరణం వెంకటేశ్ తెలిపారు. కేవలం రవి వల్లే అద్దంకిలో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు.
కాగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్న విషయం తెలిసిందే. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో కరణం వర్గీయులు ఇద్దరు చనిపోయారు.