కీసర, న్యూస్‌లైన్: కీసరగుట్టలో కార్తీక మాసోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కావడంతో నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం యాగశాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగాలకు, ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలోని శివలింగాలకు పసుపు, కుంకుమ, పూలు, పాలు, నూనెలతో అభిషేకాలు చేశారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపోత్సవం నిర్వహించారు.
స్వామివారి పల్లకీసేవ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితులు కన్నుల పండువగా జరిపించారు. మహామండపంలో సామూహిక అభిషేకాలను నిర్వహిం చారు. పూజల అనంతరం భక్తులు గుట్ట దిగువన హుడాపార్కులో కుటుంబసమేతంగా వనభోజనాలు చేసి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. పూజా కార్యక్రమాల్లో కేఎల్లార్ ట్రస్టు చైర్మన్ విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ టి.నారాయణశర్మ, ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దేవస్థానానికి సోమవారం ఒక్కరోజే సుమారు రూ.3 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ వర్గాలు తెలిపాయి.
నీటికరువు..
ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు, నిర్వాహకులు తొలిరోజే భక్తులకు మంచినీటిని అందించడంలో విఫలమయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుళాయిల నుంచి చుక్కనీరు రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివలింగాలకు అభిషేకం చేయడానికి గుట్ట కిందికి వెళ్లి మంచినీటి ప్యాకెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో మధ్యాహ్నానికి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించారు.