కార్తీక వెన్నెల
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆర్‌కే బీచ్ కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. ఉదయం నుంచే పాదరసలింగేశ్వరునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు శివుని దర్శించుకొని అభిషేకాలు చేయించుకున్నారు. భవతారిణీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ధర్మకర్త సుదీప్త బెనర్జీ భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
సిరిపురం : కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగరతీరం గురువారం ఆధ్యాత్మిక తరంగాలతో శోభిల్లింది. ఉదయం నుంచే తండోపతండాలుగా భక్తులు బీచ్‌కు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. అరటి డొప్పల్లో ఒత్తులతో దీపాలు వెలిగించి సముద్రంలో వదిలారు. సూర్య నమస్కారాలు చేసి సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు.
మరికొందరు ఇసుక తిన్నెలపై శివుని రూపాన్ని తయారు చేసి దానితోపాటు తులసిని నాటి, దాని చుట్టూ ఒత్తులతో కూడిన ప్రమిదలు వెలిగించి కోరిన కోరికలు తీర్చాలని శివుని ప్రార్ధించారు. అనంతరం పిల్లాపాపలతో కలిసి దగ్గర్లో ఉన్న కాళీమాత ఆలయంలో ఉన్న పాదరస శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజస్థానీ, గుజరాతీకి చెందిన భక్తులతోపాటు నగరానికి చెందిన పలువురు మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు.
డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ సత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. తెల్లవారుజాము రెండు గంటల నుంచి భక్తులు క్యూలో నిలుచున్నారు. గంటగంటకు భక్తుల సంఖ్య పెరుగుతూనే వచ్చిం ది. కనీస సదుపాయాల్లేక భక్తులు అవస్థలు పడ్డా రు.
వాహనాలను అనుమతించకపోవడంతో కేజీ హెచ్ వైపు నుంచి వెళ్లే భక్తులకు మార్చురీ వద్దనే నిలిపి వేశారు. ఏవీఎన్ కళాశాల వైపు వచ్చే భక్తులకు ఆంధ్రా మెడికల్ కళాశాల గేట్ వద్దనే నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర నడచి వెళ్లాల్సివచ్చింది. మెట్ల మార్గం కూలడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో వేలాదిమంది దంపతులు పాల్గొన్నారు.