అసలు మతలబు ‘ఆత్మీయ’మేనా!
విజయవాడ: కొల్లేరువాసుల ఓట్లు వలలో పడ్డాయి.. ఎంపీ పదవి దక్కింది.. చివరి ఏడాదైనా అనుకున్న కేంద్రమంత్రి పదవి వరించింది.. పైకి ఎన్ని చెప్పినా ఐదేళ్లు పదవులను అనుభవించడం కూడా పూర్తయింది.. ఇంకేముంది అనుకోకండి.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజలు, కార్యకర్తల ‘ఆత్మీయత’ గుర్తొచింది. కొల్లేరు సమస్యలను పట్టించుకోకుండా, రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా కాలాన్ని వెళ్లబుచ్చే ప్రయత్నం చేసిన కావూరి మళ్లీ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తూ సరికొత్త వేషంతో ముందుకు వస్తున్నారు. ఆయన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు.
ఎవరికోసం ‘ఆత్మీయ’ సమావేశం
తన రాజకీయ భవితను నిర్ణయించుకునేందుకు ఏలూరులో కావూరి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏలూరు లోక్‌సభ పరిధిలోని కృష్ణా జిల్లాకు చెందిన కైకలూరు, నూజివీడు కాంగ్రెస్ శ్రేణులకు కబురు పంపించారు. నూజివీడులో ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వర్గమే బలంగా ఉండడంతో కావూరి పిలుపునకు అక్కడి నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదు. కైకలూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల్లోని తన సామాజికవర్గం నుంచి ఏలూరు ఆత్మీయ సమావేశానికి గణనీయంగానే జన సమీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో కావూరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో క్యాడర్, ప్రజల సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకుంటానంటూ ప్రతిపాదన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిని బట్టి తన రాజకీయం కోసమే ఈ సమావేశం ఉద్దేశమన్నది బహిరంగ రహస్యం.
టీడీపీలోకి వస్తే మాగంటి ఎటాక్..
కాంగ్రెస్ గుర్తుతో పోటీచేస్తే సీటు గల్లంతయ్యే అవకాశం ఉందని భావించిన కావూరి కనీసం పోటీ ఇచ్చినా పరువు దక్కుతుందన్న ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం మొదలైంది. అదే జరిగితే ఇప్పటికే టీడీపీలో ఏలూరు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీమంత్రి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) నుంచి రాజకీయ ఎటాక్ తప్పేలా లేదు. గతంలో ఇద్దరు కాంగ్రెస్‌లో కొనసాగినా.. అటు తరువాత కాంగ్రెస్, టీడీపీలో చేరొకరు ఉన్నా వీరద్దరి రాజకీయం కొల్లేరు చుట్టూనే తిరిగేది. కొల్లేరువాసుల ఓట్లకు వలవేస్తే గెలుపు సాధ్యమనుకునే వీరిద్దరూ కొల్లేరు రాజకీయాన్ని కొన్నేళ్లుగా చక్కగా పండిస్తున్నారు.
ఇప్పటికే మాగంటి ఏలూరు టీడీపీ ఎంపీ టిక్కెట్ తనదే అన్న ధీమాలో ఉన్నారు. ఇంతలో కావూరి ఆ టికెట్ తనుకుపోయి తమ నాయకుడికి కైకలూరు ఎమ్మెల్యే టిక్కెట్‌తో సరిపెడతారేమోననే భయం మాగంటి బాబు అనుయూయుల్లో మొదలైంది. దీంతో కావూరి టీడీపీలోకి వస్తే వ్యతిరేకించేందుకు మాగంటి సైన్యం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అటు కావూరితో స్నేహ సంబంధాలు, ఇటు మాగంటితో పార్టీ సంబంధాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుందని కైకలూరులో అప్పుడే గుసగుసలు మొదలుకావడం కొసమెరుపు.