
తొలగించిన ఫ్లెక్సీ ఇదే
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం బస్టాండ్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంశం వివాదంగా మారుతోంది. అనుమతి లేదంటూ ఫ్లెక్సీని హఠాత్తుగా తొలగించారు. ఫ్లెక్సీ తొలగింపు సమయంలో పోలీసులు, కొందరు మునిసిపల్ సిబ్బంది, ఇద్దరు అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఆర్టీసీ డీఎం కూడా దగ్గరన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన ఫ్లెక్సీలను అలాగే ఉంచి ఒక్క ఈ ఫ్లెక్సీనే ఎందుకు తొలగించారని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారు నిలదీయడంతో వివాదం పెద్దదవుతోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరునాడు బుధవారం బస్టాండ్ సెంటర్‌లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, హైదరాబాద్ సెటిలర్ అయిన సీహెచ్ చినరెడ్డప్ప ధవేజీ, అతని స్నేహితులు మేడిద రాము, బుడితి అనిల్ కలసి తెలంగాణ బాహుబలి కేసీఆర్‌కు శుభాకాంక్షలు అని స్లోగన్ ఇస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ జనాన్ని బాగా ఆకర్షించింది. అయితే పోలీసులు వచ్చి ఎస్సై ఫ్లెక్సీ తీయించారని మేడిది రాము తెలిపారు. అయితే టౌన్ ఎస్సై మాత్రం ఫ్లెక్సీ మేం తీయించలేదని, మాకు సంబందం లేదని అంటున్నారు. మునిసిపల్ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. దీంతో ఈ అంశం వివాదంగా మారింది. ఇబ్బందికరంగా ఉండటం, ప్రజల నుంచి స్పందన రావడంతో టీడీపీ పెద్దలే తీయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ గతంలో మాయావతి ఫ్లెక్సీలు పెట్టారని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్టారన్నారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నించారు. మునిసిపాలిటీ అనుమతి తీసుకుని మళ్లీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామన్నారు. తామేమీ ఎవరినీ కించరుస్తూ ఫ్లెక్సీ పెట్టలేదన్నారు. కేవలం శుభాకాంక్షలు మాత్రమే చెప్పామని అందులో తప్పేముందని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment